జనాభాను బట్టి ఆశ కార్యకర్తలను నియమించకపోవడంతో పనిభారంతో సతమతమవుతున్నాం. 18 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. వేతనం నెలకు రూ.9,900 ఇస్తున్నారు. పెరిగిన ధరలతో పోల్చుకుంటే ఎటూ సరిపోవడం లేదు. వేతనం పెంచాలి.
– బి.కావ్య, ఆశ కార్యకర్త, రహీంఖాన్‌పేట
ఆశ కార్యకర్తలం వివిధ కార్యక్రమాలు, సర్వేల్లో పాల్గొంటున్నా ప్రభుత్వం పారితోషితం సకాలంలో ఇవ్వడం లేదు. ఆశ కార్యకర్తల మీదనే అదనపు పనిభారం మోపుతున్నారు. ఆశ కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి.
– రాచమల్ల సరిత, మండల అధ్యక్షురాలు
ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీ లను ప్రభుత్వం పరిష్కరించని ఝెడల డిసెంబర్ 5 నుంచి నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తాం. 18 ఏళ్లుగా ఆశ కార్యకర్తలతో వెట్టి చేయిస్తున్నారు. ఆశ కార్యకర్తలకు నెలకు రూ.26 వేల వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.
– రావుల సంతోష,
ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు
ఆత్మకూరు(ఎం) : గ్రామీణ, పట్టణ ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలకు వారధిగా నిలుస్తున్న ఆశ కార్యకర్తలు పనిభారంతో సతమతమవుతున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆశ కార్యకర్తలు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
ఆశల నియామకం, విధులు ఇలా..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద మాతా శిశు సంరక్షణ, మరణాల అరికట్టడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రాథమిక చికిత్స కోసం ఆశ కార్యకర్తలను నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28 వేల మంది, జిల్లాలో 683 మంది ఆశ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. తమకు కేటాయించిన విధులతోపాటు పల్స్ పోలియో, వివిధ సర్వేలు, ఆరోగ్య సిబ్బంది కొరత వల్ల సబ్ సెంటర్ డ్యూటీలను చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆశ కార్యకర్తల వేతనం రూ.9,900 నుంచి రూ.18,000కు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకోసం డిసెంబర్ 5 నుంచి 10 వరకు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆశ కార్యకర్తల సంఘం ప్రకటించింది.
డిమాండ్లు ఇవే..
● ఫిక్స్‌డ్ వేతనం రూ.26 వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి.
● పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలి.
● మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న వివిధ సర్వేల పారితోషికాలు వెంటనే చెల్లించాలి.
● ఆన్‌లైన్ సర్వేలు, సబ్ సెంటర్లు, ఇతర శాఖల కార్యక్రమాల డ్యూటీలు వేయకుండా పనిభారం తగ్గించాలి.
ఫ పనిభారంతో సతమతం
ఫ హామీలు అమలుకావట్లేదని ఆవేదన
ఫ వేతనాలు పెంచాలని డిమాండ్
ఫ డిసెంబర్ 5 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న ఆశ కార్యకర్తలు


