ఉన్నతాధికారులకు నివేదిస్తాం
భువనగిరి : భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా విభాగాల్లో పట్టణ ప్రజలకు సకాలంలో సేవలందక ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలో పూర్తి స్థాయిలో అధికారులు ఎప్పుడు నియమించబడుతారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఖాళీ పోస్టులు ఇవే..
ప్రస్తుతం మున్సిపాలిటీ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన అధికారి మహబూబబాద్ జిల్లాలోని మరిపెడ బదిలీపై వెళ్లారు. దీంతో కార్యాలయ సిబ్బంది నియంత్రణ, రికార్డుల భద్రత, మున్సిపల్ సమావేశాలకు కావల్సిన సమాచారం అందించడం, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, పార్కులు వార్సిక బడ్జెట్, రూపకల్పన, నిధుల వ్యయం వంటి విధుల నిర్వహణ ప్రస్తుతమున్న అధికారులపైనే పడింది. దీనికితోడు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ (టీపీఎస్) పోస్టు ఖాళీగా ఉంది. అలాగే ఇద్దరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ)లు డిప్యుటేషన్‌పై యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీలకు వెళ్లారు. ఇద్దరు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ (టీపీబీఓ)లకు ఒక్కరు డిప్యుటేషన్‌పై వెళ్లారు. డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) పోస్టు ఖాళీగా ఉంటే కోదాడ మున్సిపాలిటీ నుంచి ఇక్కడి డిప్యుటేషన్‌పై వచ్చారు.
మెప్మా విభాగంలోనూ కొరతే..
భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మా విభాగంలో కమ్యూనిటీ ఆర్గనైజర్స్ రెండు పోస్టులకు గాను రెండు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒక్కరు సస్పెండ్ కాగా మరొకరు బదిలీపై వెళ్లారు. దీంతో మహిళా సంఘాలను ఆర్గనైజింగ్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఫ భువనగిరి మున్సిపాలిటీలో 8 ప్రధాన పోస్టులు ఖాళీ
ఫ మేనేజర్ లేక కార్యాలయంలో పర్యవేక్షణ కరువు
ఫ డిప్యుటేషన్‌పై వెళ్లిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, ఆఫీసర్లు
ఇక్కడ మేనేజర్‌గా పనిచేసి వారు ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌గా వెళ్లడంతో భువనగిరిలో ప్రస్తుతం మేనేజర్ లేరు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే ఐదుగురు అధికారులు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లాం. సిబ్బంది కొరతతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తా.
– చంద్రప్రకాష్ రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి


