యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో నూతన కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈఓ భవానీ శంకర్ గురువారం పరిశీలించారు. శ్రీస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా నిత్య కల్యాణ వేడుకను నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రథమ ప్రాకార మండపంలో ఈ నిత్య కల్యాణ వేడుకను జరిపిస్తున్నారు. అందులో సుమారు 80కి పైగానే జంటలు పాల్గొనేందుకు అవకాశం ఉంది. కానీ గతంలో ఆలయ పునః నిర్మాణంలో భాగంగా కొండపైన భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన బాలాలయం ప్రాంగణంలోనే నూతన కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇటీవల వైటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చైర్మన్ సత్యనారాయణరెడ్డి నిత్య కల్యాణ మండపం నిర్మిస్తానని ముందుకు వచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం నూతన నిత్య కల్యాణ మండపానికి భూమి పూజ చేయనున్నారు. సుమారు 1500 మంది నిత్య కల్యాణంలో పాల్గొని, వీక్షించేలా ఈ నిర్మాణం జరగనుంది. ఏడాది కాలంలోపే పనులు పూర్తి చేసేలా అధికారులు, వైటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రాయగిరి వద్ద వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సొంత నిధులతో నిర్మించే ఆర్చి (స్వాగత తోరణం)కి సైతం ఉదయం 11.14 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా..
యాదగిరి కొండపై కల్యాణ మండపానికి భూమి పూజ జరిగే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, ఉద్యోగులకు పలుసూచనలు చేసినట్లు తెలిపారు.


