వలిగొండ: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం వలిగొండ మండలం వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, రోగుల నమోదు, సిబ్బంది హాజరు పట్టిక, తదితర రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది ప్రతిరోజూ యాప్లో హాజరు నమోదు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజువారీగా వచ్చే ఓపీ సంఖ్యను, రోగుల వివరాలను శ్రీఆభాశ్రీ యాప్లో నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. ల్యాబ్లో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, సేకరించిన నమూనాలను తదుపరి పరీక్షల కోసం ఎక్కడికి పంపిస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల ఏఎన్సీ రిపోర్టులను తనిఖీ చేసి, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ప్రసవాలు ఏ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయో ట్రాక్ చేయాలని సూచించారు.వెల్వర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పరిస్థితిని పరిశీలించారు. ఆరో తరగతి, పదో తరగతి విద్యార్థులతో పాఠ్యపుస్తకాలు చదివించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి భిక్షపతి, డీఎంహెచ్ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్, డాక్టర్ ఖాజా, తహసీల్దార్ దశరథ, ఎంఈఓ భాస్కర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


