పెద్దవూర: వానాకాలం సీజన్లో వేసిన వరికోతలు ప్రారంభమయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్రవర్షాభావ పరిస్థితులతో ఈ యేడాది గతంలో కంటే వరి సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. వచ్చే యేడాది సైతం సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో ఈ సారి రైతులు వడ్లను కొనుగోలు చేసుకుని నిల్వ ఉంచుకోవడానికి ఆసక్తి కనపర్చుతున్నారు. రైతులు తినడానికి తాము పండించిన పంటలో కొంతభాగాన్ని భద్రపర్చుకుంటుంటారు. మరికొందరు రైతులు సీజన్లో ధర తక్కువగా ఉంటుందని భావించి మరికొందరు రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించకుండా అధిక ధర వచ్చేదాకా ఇంట్లోనే నిల్వ చేసుకుని ధర రాగానే అమ్మేస్తుంటారు. ఇందులో భాగంగా ధాన్యాన్ని ఎలా భద్ర పర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పండించిన పంటలో 10 నుంచి 20 శాతం నష్టపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ. ధాన్యం నిల్వ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ధాన్యం నూర్పిడి తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలకు కలిపి సుమారు ఏడాదికి పైగా భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ధాన్యం రంగు, రుచి తగ్గుతుంది. సాధారణంగా వరికోతల సమయంలో ధాన్యంలో 20శాతం తేమ ఉంటుంది. వరి పంటను కోసిన తర్వాత వరి పసలను ఆరబెట్టడం వల్ల 4 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతానికి తేమ ఉంటే బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాల్సి ఉంటుంది. ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు ఆశించి నష్టం కలుగచేస్తాయి. అంతే కాక ఎలుకలు ధాన్యాన్ని తినడమేకాక, వాటి విసర్జనలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టపరిచే కీటకాలు
ముక్క పురుగు : పంట కోయడానికి ముందు నుంచి ముక్క పురుగు నష్టం కలిగిస్తుంది. బియ్యంలో తెల్లని పురుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ పురుగులే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి అందులో గుడ్లు పెట్టి తన నోటి నుంచి వెలువడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా ప్రౌడ దశలోని ముక్క పురుగు గింజ లోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది.
వడ్ల చిలుక : ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే ధాన్యం చెడువాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపులుగా చేరి గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి లార్వా గింజ లోపలికి తొలుచుకుని పోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరక ముందే పై పొట్టులో చిన్న రంద్రం చేస్తుంది. ప్రౌఢ దశకు చేరిన తరువాత ఆ రంద్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వడ్ల మూటలు, గిడ్డంగులపై కనిపిస్తుంది.
నుసి పురుగు : దీనిని పుచ్చ పురుగు లేదా పెంకు పురుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నదిగా 3 మి.మీ పొడవు ఉంటుంది. ప్రౌఢ కీడకం ధాన్యం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, ఆ తరువాత గింజ పైపొరను, ఆ తర్వాత లోపలి బియ్యపు గింజను తిని తీవ్ర నష్టం కలిగిస్తుంది.
ఎలుకల నివారణకు చర్యలు
ధాన్యం గిడ్డంగి చుట్టూ చెత్త లేకుండా రోజూ శుభ్రం చేస్తుండాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలను ఉపయోగించి ఎలుకలను నిర్మూలించాలి. గిడ్డంగి తలుపుల కింది భాగాలకు జింక్ రేకులు అమర్చాలి. రంధ్రాలకు వైర్ మెస్ మూతలు అమర్చాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు.
ధాన్యం నిల్వ చేసే పద్ధతి
రైతులు తక్కువ ధాన్యం నిల్వ చేసుకోవాలంటే వెదురు గాదెలు, సిమెంటు గాదెలు, లోహపు గాదెల ద్వారా నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మించుకుంటే పూర్తి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు, తేమ, వర్షం నీరు లోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే గాజు ముక్కలు, సిమెంటుతో పూడ్చి వేయాలి. ధాన్యం నిల్వలో కొత్త గోనె సంచులు ఉపయోగించాలి. గోనె సంచుల పైన, లోపల మలాథియాన్ లేదా ఎండో సల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. మరునాడు సంచులను ఎండలో ఆరబెట్టాలి.


