నీటి కొరతను అధిగమించి.. పుచ్చ సాగు | - | Sakshi
Sakshi News home page

నీటి కొరతను అధిగమించి.. పుచ్చ సాగు

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

ఆత్మకూరు(ఎం): వర్షాభావ పరిస్థితులు నిరాశ పరిచినా ఆ రైతు వెనకడుగు వేయలేదు. ఉద్యాన శాఖ సాయంతో ఫామ్‌పాండ్‌ నిర్మించి.. డ్రిప్‌ ద్వారా తక్కువ నీటితోనే ‘పుచ్చ’ సాగు చేపట్టాడు. ఆత్మకూరు.ఎం మండల కేంద్రానికి చెందిన రైతు నాగం మధుసూదన్‌రెడ్డి ఆరుతడి పంటగా పుచ్చ సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. ఆయన తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో మునగ, బెండ పంటలను సాగు చేశాడు. గతంలో పుచ్చ సాగు చేయడం ద్వారా మంచి లాభాలు రావడంతో ఈసారి మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని పుచ్చకాయ సాగు చేపట్టాడు.

సాగు విధానం..

వరి సాగుకు నీరు సరిపోకపోవడంతో రైతు మధుసూదన్‌రెడ్డి క్నోన్‌ రకం పుచ్చ విత్తనాలను ఎంచుకున్నాడు. నాలుగు ఎకరాలకు ఒక ప్యాకెట్‌ (ధర రూ.4,500) గింజలు సరిపోతాయి. విత్తనానికి విత్తనానికి మధ్య రెండు అడుగులు, బోద బోదకు మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా విత్తుకున్నాడు. రెండు బోర్లలో నీళ్లు అంతంత మాత్రమే పోస్తుండటంతో ఉద్యానవన శాఖ సహకారంతో పొలంలోనే ఫామ్‌పాండ్‌ నిర్మించుకున్నాడు. బోర్ల ద్వారా వచ్చిన నీటిని ఫామ్‌పాండ్‌లో నిల్వ చేసి, డ్రిప్‌ పరిజ్ఞానంతో తోటకు అందిస్తున్నాడు. విత్తనం నాటిన మొదట్లో రోజుకు 15 నిమిషాలు, 20–30 రోజుల మధ్య రోజుకు 30 నిమిషాలు, కాత దశలో రోజుకు రెండు గంటల పాటు డ్రిప్‌ ద్వారా నీరు అందిస్తే సరిపోతుందని, వరి పంటతో పోలిస్తే నీటి వాడకం చాలా తక్కువని పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌ మార్కెట్‌కు ఎగుమతి

విత్తనం నాటిన 70 రోజుల్లోనే కాత చేతికి వస్తుంది. ఒక్కో కాయ 3 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. ప్రస్తుతం కాత చేతికి రావడంతో కూలీల ద్వారా కాయలు కోయించి హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తున్నాడు. మార్కెట్‌లో ప్రస్తుతం టన్నుకు రూ.15,000 వరకు ధర లభిస్తోందని, ఎకరానికి 10 టన్నుల చొప్పున దిగుబడి వస్తోందని తెలిపాడు. నాలుగు ఎకరాల సాగుపై రూ.5 లక్షల వరకు ఖర్చయిందని, తెగుళ్లు సోకకుండా జాగ్రత్త పడితే నీటి కొరత ఉన్నప్పటికీ పుచ్చ సాగుతో మంచి లాభాలు ఉంటాయని రైతు మధుసూదన్‌రెడ్డి చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement