అర్వపల్లి : మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అర్వపల్లి శివారులోని పర్వత శ్రేణుల మధ్య కొలువైన హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్‌బోర్డు రాష్ట్ర, జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, పోలీసు శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఉత్సవాల వివరాలివే..
● వచ్చే నెల 6న ఉర్సు ఉత్సవాల్లో భాగంగా అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి దర్గా వద్ద ప్రత్యేక ఖవ్వాలీ కార్యక్రమం నిర్వహిస్తారు.
● 7న బాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో దీపారాధన (చిరాగ్) కార్యక్రమం జరుగుతుంది.
భక్తులకు మౌలిక వసతుల కల్పన
ఈ ఉర్సు ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ముస్లింలతో పాటు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. భక్తుల రాక నేపథ్యంలో జాతీయ రహదారి–365 నుంచి దర్గాకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో.. అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వక్ఫ్‌బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్, జిల్లా ఇన్‌స్పెక్టర్ దస్తగిరి తెలిపారు.
6న గంధం ఊరేగింపు..
7న దీపారాధన
రాష్ట్ర నలుమూలల నుంచి
తరలిరానున్న భక్తులు


