సూర్యాపేట టౌన్ : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ భరోసా కేంద్రాన్ని యూనిసెఫ్ బాలల రక్షణ బృందం ప్రతినిధులు, చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోనికుట్టి జార్జ్, టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ ఫిలిప్స్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం ద్వారా బాధితులకు అందిస్తున్న వివిధ సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డితో కలిసి భరోసా కేంద్రం, షీ టీం కార్యాలయాలను సందర్శించిన బృందం సభ్యులు.. లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు పోలీస్ భరోసా కేంద్రం ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భరోసా, షీ టీం బృందాలు మహిళా, బాలల రక్షణలో పటిష్టంగా పని చేస్తున్నాయని తెలిపారు. లైంగిక దాడి కేసుల్లో బాధితులుగా ఉన్న మహిళలు, చిన్నారులు అండగా నిలవడం, వారిలో సామాజిక ౖధైర్యం, భద్రత కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. భరోసా కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డ్స్‌ను, కౌన్సిలింగ్ విధానాన్ని పరిశీలించి భరోసా పనితీరును అభినందించారు. కార్యక్రమంలో భరోసా టీం ఎస్‌ఐ మౌనిక, షీ టీం ఎస్‌ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు.


