కాపర్‌ వైర్ల చోరీ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కాపర్‌ వైర్ల చోరీ ముఠా అరెస్ట్‌

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

పరారీలో మరో ఐదుగురు

అరెస్టయిన నిందితులు వీరే..

నల్లగొండ : వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ వైర్లు, ఆయిల్‌ చోరీ చేస్తున్న దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. వేములపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై ఉన్న ఎల్‌–15 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు చెందిన 500 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌లో 300 కిలోల కాపర్‌, 250 లీటర్ల ఆయిల్‌ చోరీకి గురైంది. ఈ ఘటనపై అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ధనావత్‌ పాండు నాయక్‌ ఆగస్టు 22న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం వేములపల్లి గ్రామ శివారులోని సూర్యాపేట ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా కారులో అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేశారు. వారిలో షేక్‌ చంద్‌ పాషా అనే పాత నేరస్తుడు ఉన్నట్లు గుర్తించారు. కారులో కట్టర్లు, పానాలు, గ్లౌజులు లభించడంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారు గతంలో పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్‌, ఇతర సామగ్రిని దొంగిలించి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పాతసామాను వ్యాపారి దేశిరామ్‌కు విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. దొంగిలించిన సామగ్రికి సంబంధించిన డబ్బులు తీసుకోవడంతోపాటు, తమ వద్ద ఉన్న మరికొంత కాపర్‌ను విక్రయించేందుకు దేశిరామ్‌ మిర్యాలగూడలోని చాంద్‌ పాషా ఇంటికి వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో దేశిరామ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నిందితుల వద్ద సుమారు రూ.30 లక్షల విలువైన రెండు కార్లు, రూ.20 లక్షల నగదు, ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ వైర్‌, రెండు కట్టర్లు, నాలుగు పానాలు, హ్యాండ్‌ గ్లౌజులు, మూడు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాత్రివేళల్లో చోరీలు

నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఠాలుగా ఏర్పడి, గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించేవారు. రాత్రివేళల్లో కార్లలో అక్కడికి చేరుకుని కట్టర్లు, పానాల సాయంతో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని కాపర్‌ వైర్లు, ఆయిల్‌, అల్యూమినియం వైర్లతోపాటు ఇతర విలువైన భాగాలను అపహరించేవారు. దొంగిలించిన సామగ్రిని హయత్‌నగర్‌లోని పాతసామాను వ్యాపారులకు విక్రయించి, వచ్చిన డబ్బులను పంచుకునేవారని ఎస్పీ తెలిపారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నకిలీ నంబర్‌ ప్లేట్లు ఉన్న వాహనాలను వినియోగించడంతోపాటు, తమ ముఠాలోని మహిళలను కూడా కొన్ని సందర్భాల్లో వెంట తీసుకెళ్లేవారని వెల్లడించారు.

నల్లగొండ జిల్లాలోనే 18 కేసులు

ముఠా సభ్యులపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 29 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో 25, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. వేములపల్లి, వాడపల్లి, మాడ్గులపల్లి, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ టూటౌన్‌, తిరుమలగిరిసాగర్‌, హాలియా, త్రిపురారం, కనగల్‌, చింతపల్లి, నేరెడుగొమ్ము, దేవరకొండ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ఇతర ప్రాంతాల్లో ఏడు కేసులు

తూప్రాన్‌, చౌటుప్పల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మనోహరాబాద్‌ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ దొంగలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, మాచవరం, దాచేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధి లో నాలుగు చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.

ముఠాలోని సంతోష్‌, నాన్కు, మోడల్‌ సాయి, ప్రియా, సునీత అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌ రెడ్డి, మిర్యాలగూడ టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమనర్సయ్య, మిర్యాలగూడ రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.ఎన్‌.డి. ప్రసాద్‌, వేములపల్లి ఎస్‌ఐ సురేశ్‌ రెడ్డి తదితరులు కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

ఫ పోలీసుల అదుపులో నలుగురు

నిందితులు.. పరారీలో మరో ఐదుగురు

ఫ రూ.20 లక్షల నగదు, వాహనాలు, ఇతర సామగ్రి స్వాధీనం

ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ

ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

షేక్‌ చంద్‌ పాషా మిర్యాలగూడలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌. ప్రస్తుతం హయత్‌నగర్‌లోని కుంట్లూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. రామావత్‌ సూర్య పీఏపల్లి మండలం పడమటి తండాకు చెందిన ఆటోడ్రైవర్‌.. ప్రస్తు తం హైదరాబాద్‌లోని ఇంజాపూర్‌ భవానోలి కాలనీలో నివాసం ఉంటున్నాడు. గలబ సాయి కిరణ్‌ మిర్యాలగూడలోని సాబునగర్‌కు చెందిన కూలీ. ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసం ఉంటున్నాడు. దొంగిలించిన సామగ్రిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇస్లావత్‌ దేశిరామ్‌. ఇతను హైదరాబాద్‌లోని హస్తినాపురం కస్తూరి కాలనీలో ఉంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement