పెద్దవూర: బావులు, బోర్లు, ఇతర నీటి పారుదల కింద ఆకుకూరల సాగును ఆరుతడి పద్ధతిలో తక్కువ నీటితో సాగు చేపట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు. సాగు చేయాల్సిన ఆకుకూరల రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి ఆయన మాటల్లోనే..
సాగు చేయాల్సిన ఆకుకూరలు ఇవే..
పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, మెంతికూర, పుదీన, కొత్తిమీర, బచ్చలికూర ప్రస్తుతం సాగు చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. తోటకూరలో ఏఆర్ఎన్ఏ రకం మంచి దిగుబడి వస్తుంది. విత్తిన 15–20 రోజులకే మొదటి కోత వస్తుంది. పూసాలాల్ చౌలై రకం ఆకుల పైభాగం ముదురు ఎరుపు రంగులోనూ, అడుగు భాగం నీలి ఎరుపు రంగులో ఉంటుంది. విత్తిన 24–30 రోజులలో మొదటి కోతకు వస్తుంది. వీటితో పాటు ఆర్క అరుణ, కో–1,2,3 రకాలను సాగు చేయవచ్చు. పాలకూరలో ఆల్గ్రీన్ రకం మేలైనది. ఇది విత్తిన 15–20 రోజులలోనే కోతకు వస్తుంది. 6 నుంచి 7 కోతల్లో ఎకరాకు 50 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. ఆర్క అనుపమ కూడా సాగు చేయవచ్చు. మెంతికూరలో లాంసెలక్షన్–1 రకం గుబురుగా పెరుగుతుంది. ఎక్కువ ఆకు దిగుబడిని ఇస్తుంది. పూసాఎల్లీ బించింగ్ రకం కూడా తొందరగా కోతకు వస్తుంది. హిస్సార్ సువర్ణరకం కూడా పూసాఎల్లీ బంచింగ్ కంటే 20 శాతం అధిక దిగుబడి వస్తుంది. గోంగూరలో ఏఎన్జీఆర్యూ–1 రకం ఎకరాకు 4–5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎంఎస్–3 రకం కూడా ఎర్ర గోంగూర రకానికి చెందినదే. దీనిని కూడా తడికింద ఎప్పుడైనా సాగు చేయొచ్చు. కొత్తిమీరలో స్వాతి(సీఎస్–6) పంట కాలం 80–85 రోజులు ఉంటుంది. సాధన (సీఎస్–4) రకం పంటకాలం 100–110 రోజులు ఉంటుంది. ఇది పేనుబంకను తట్టుకుంటుంది. వీటితో పాటు కరివేపాకులో సువాసిని, డీడబ్ల్యూ 1–2 రకాలు, బచ్చలిలో ఎర్ర బచ్చలి, పుదీనాలో స్పియర్మింట్ వంటి రకాలు సాగుకు అనుకూలం.
దిగుబడి పెంచడానికి మార్గాలు
తక్కువ కాలపరిమితి, అధిక దిగుబడులు ఇచ్చే రకాలు ఎంపిక చేసుకోవాలి. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ను ఉపయోగించి విత్తన శుద్ధి చేయాలి. విత్తిన 20 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు కలుపు తీసి మట్టిని కదిలించాలి. విత్తే ముందు ప్లుక్లోరిలిన్ కలుపు మందును ఎకరాకు 800 గ్రాములు వాడాలి. ఆకు కూరల సాగుకు సాధ్యమైనంత ఎక్కువగా సేంద్రీయ ఎరువులను వాడితే నేలలో తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచి సూక్ష్మజీవుల చర్యలు అధికమై పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమిలో తేమను బట్టి 5–7 రోజులకు తడి ఇవ్వాలి. విత్తిన మొదటిసారి నీరు పెట్టేటప్పుడు నెమ్మదిగా పెట్టాలి. నీటి వేగం ఎక్కువైతే విత్తనాలన్నీ కింది వైపుకు కొట్టుకు వచ్చి మొలకశాతం తగ్గుతుంది. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రెండు శాతం యూరియా అంటే లీటరు నీటికి 20 గ్రాములు కలిపి చల్లాలి.
విత్తే పద్ధతి
పాలకూర సాగుకు వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 10సెం.మీ. ఉండాలి. గోంగూరకు వరుసల మధ్య దూరం 30సెం.మీ.లు, మొక్కల మధ్య దూరం 10 సెం.మీ.లు, తోటకూరలో వరుసల మధ్య దూరం 20 సెం.మీ., మెంతికూరలో వరుసల మధ్య దూరం 25 సెం.మీ.లు, మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లు, బచ్చలికూరలో వరుసల మధ్య 60 సెం.మీ.లు, మొక్కల మధ్య దూరం 60 సెం.మీ.ల దూరం ఉండాలి.


