ప్రధానార్చకులు సురేంద్రాచార్యులకు ఐకాన్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

ప్రధానార్చకులు సురేంద్రాచార్యులకు ఐకాన్‌ అవార్డు

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ప్రధానార్చకులు– 2 బట్టార్‌ సురేంద్రాచార్యులు ప్లాటినం ఐకాన్‌ – 2026 అవార్డు అందుకున్నారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉజ్వల శిఖరం ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డును అందజేసి సన్మానించారు. ఆధ్యాత్మిక రంగంలో సేవలు అందించినందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు ఉజ్వల శిఖరం ఆర్ట్స్‌ ప్రతినిధులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎస్‌ రెమిడీస్‌కు చెందిన నరసింహ తాంత్రి, లక్ష్మి, సతీష్‌ యాదవ్‌, పెండెం శ్రీనివాస్‌ గురుస్వామి, బాలరాజు, నరసింహరావు, పూల గురుస్వామి తదితరులున్నారు.

భారత హాకీ జట్టు

ప్రాబబుల్స్‌లో గణేష్‌కు చోటు

నల్లగొండ టూటౌన్‌ : తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి హాకీ పోటీల్లో నల్లగొండ జిల్లాకు చెందిన క్రీడాకారుడు రావుల గణేష్‌ తెలంగాణ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీల్లో గణేష్‌ ప్రతిభ కనబరచడంతో త్వరలో జరగనున్న అంతర్జాతీయ హాకీ పోటీలకు సంబంధించిన ప్రాబబుల్స్‌ జాబితాలో చోటు దక్కింది. రాష్ట్రం నుంచి గణేష్‌ ఒక్కరికే చోటు దక్కడంపై హాకీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కూతురు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి ఇమామ్‌ కరీం అభినందనలు తెలిపారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మర్రిగూడ (చింతపల్లి) : మండలంలోని చింతపల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. చింతపల్లి శివారులోని మహమ్మద్‌ ఖాలిద్‌కు చెందిన వ్యవసాయ భూమి వద్ద కొందరు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి రూ.7,500 నగదుతో పాటు 5 సెల్‌ఫోన్లు, 104 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ నట్టువ వెంకటకృష్ణ, కానిస్టేబుళ్లు ఎం.సాయి, ఎ.సాయికుమార్‌, మహేందర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వైన్‌ షాపులో నగదు, మద్యం బాటిళ్లు చోరీ

భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని వైన్‌ షాపులో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉన్న సునీత వైన్‌ షాపులో ఈనెల 27న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు పైన రేకులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కౌంటర్‌ ఉన్న సుమారు రూ.40వేల నగదు, కొన్ని మందు సీసాలను తీసుకుని పరారయ్యారు. షాపు నిర్వాహకుడు రోజు మాదిరిగా ఉదయం 10 గంటలకు షాపు తెరవగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మట్టి అక్రమ తవ్వకాలపై అధికారుల విచారణ

కట్టంగూర్‌ : మండలంలోని బొల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. బొల్లేపల్లిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఉబ్బని రాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు గనులు, భూగర్భ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి వసుమతి, తహసీల్దార్‌ పుష్పలత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, గ్రామ పంచాయతీ అధికారి శోభ క్షేత్రస్థాయిని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement