సూర్యాపేట : ఏ హోమము, వ్రతాలు చేయలేని భక్తులు, పేదల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ బాల మానస మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీరుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు లక్ష్మీనారాయణ సద్గురు భవాని స్వామీజీ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని యర్రంశెట్టి ఉపేందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహా యజ్ఞంకు సంబంధించిన వివరాలను స్వామీజీ వెల్లడించారు. సమాజ శ్రేయస్సు కోరి మానవ కర్మలను తొలగించేందుకు పరమహంస పరిరజాకాచార్యులు సుదర్శన ఆశ్రమ స్వామీజీ ఆశీస్సులతో 1008 మంది దంపతులచే మొట్టమొదటిసారిగా 2012లో లక్ష్మీనారాయణ యాగం మొదలు పెట్టినట్లు తెలిపారు. తొమ్మిదవ సారి 1116 మంది దంపతులచే డిసెంబర్ 1న జిల్లా కేంద్రంలో శ్రీరుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనేలా రూ.1516 చెల్లించి హోమంలో పాల్గొనే అవకాశాన్ని తమ ట్రస్టు కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ జహీర్, నాయకులు సలిగంటి వీరేందర్, యర్రంశెట్టి ఉపేందర్ తులసి, సంకురిశెట్టి పరమేష్ సబిత, ప్రసాద్, వాసుదేవరావు సరళ, ఆనందరావు అనిత, శ్రీనివాస్ రెడ్డి ఉమా, సంజీవరెడ్డి ఉదయశ్రీ, శ్రీనివాస్ రెడ్డి పద్మ, రాంరెడ్డి రమ, వెంకట్ రెడ్డి కళావతి, శ్రీనివాసరావు శిల్ప, లక్ష్మారెడ్డి సంధ్య, ట్రస్టు సభ్యులు జెట్టి రవికుమార్, రాజిరెడ్డి, శ్రావణ్ కుమార్, క్రాంతికుమార్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


