రాజాపేట : సేంద్రియ పంటలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని హైదరాబాద్‌కు సమీపంలో గల ఔషాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రవీందర్ రెడ్డి, సేంద్రియ రైతు ఠాకూర్ స్వరణ్‌పాల్ సింగ్ అన్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన సేంద్రియ రైతు ఠాకూర్ స్వరణ్ పాల్ సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని ఔషాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయానికి చెందిన 50 మంది బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ సాగు, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ప్రకృతి వనరులను సంరక్షించడం, పర్యావరణానికి అనుకూలమైన సాగు పద్ధతులను అవలంబించడం వంటి అంశాల ప్రాధాన్యతను రైతు స్వరణ్‌పాల్ సింగ్ విద్యార్థులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ప్రకృతితో సమన్వయం సాధిస్తూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అనురాగ్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ గౌరి, స్థానిక రైతులు దాచపల్లి శ్రీనివాస్, రాంగాళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.


