ఫ వర్షాలు లేక అడవుల్లో కాయని చెట్లు
ఫ గిరిజన, గ్రామీణ కుటుంబాల ఉపాధికి గండి
ఫ దిగుబడి తగ్గడంతో మార్కెట్లకు నిలిచిపోయిన సరఫరా
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతం సహజసిద్ధంగా పెరిగే నాణ్యమైన సీతాఫలాలకు ప్రసిద్ధి. ఇక్కడి గుట్టలు, అటవీ ప్రాంతాల్లో పెరిగే చెట్లు అనేక గిరిజన కుటుంబాలకు ఉపాధిని అందిస్తున్నాయి. పలు తండాల ప్రజలతో పాటు మండల కేంద్రానికి చెందిన కొన్ని కుటుంబాలు సీతాఫలాల సేకరణ, విక్రయాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా సీజన్ ప్రారంభం కాగానే తెల్లవారుజామునే అడవులు, గుట్టల్లోకి వెళ్లి సీతాఫలాలను సేకరిస్తారు. వాటిని బుట్టల్లో నింపుకుని ఆటోల్లో హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. రెండు మూడు నెలల పాటు సాగే ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం వారికి కొండంత ఆసరాగా నిలుస్తుంది.
వర్షాలు లేక అడవిలోని సీతాఫలాల చెట్లన్నీ వాడిపోయాయి. గతేడాది రోజుకు రెండు గంపల సీతాఫలాలను పుట్టపాక, మునుగోడు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించేదాన్ని. మూడు నెలలపాటు పండ్ల అమ్మకాలతో ఉపాధి ఉండేది. ఈ ఏడాది అడవిలో ఒక్క చెట్టుకు కూడా పిందెలు పడలేదు. దీంతో ఉపాధి లేకుండా పోయింది.
– కెలోత్ జీదా, పల్లగట్లుతండా
సీతాఫలాల సేకరణ గిరిజన, గ్రామీణ కుటుంబాలకు కేవలం పండ్ల వ్యాపారమే కాదు.. సీజన్‌లో అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన మార్గం. పెద్దగా పెట్టుబడి లేకుండానే అడవుల్లో లభించే పండ్లను సేకరించి విక్రయించడం ద్వారా కుటుంబ ఖర్చులకు అవసరమైన సొమ్ము సంపాదిస్తారు. కానీ దిగుబడి తగ్గడంతో సేకరణదారులకు బతుకుదెరువు కరువై ఆదాయం పడిపోతుండగా, వినియోగదారులకు మాత్రం అధిక ధరల భారం తప్పడం లేదు. ఏటా సీతాఫలాల సీజన్ కోసం ఆశగా ఎదురుచూసే రాచకొండ ప్రాంత గిరిజనులకు ఈసారి నిరాశే మిగిలింది.
బతుకుదెరువు కరువై..


