భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో సోమవారం పవిత్రోత్సవాలు ముగిసాయి. పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు గరుడువాహన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సహస్రనామార్చన సేవ జరిపించారు. స్వామి వారి సేవను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లిరామారావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
కనగల్: మండలంలోని బచ్చన్నగూడెం గ్రామంలో వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కనగల్ ఎస్‌ఐ రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన జినుకుల సత్యనారాయణ– మంగమ్మ దంపతుల పెద్ద కుమార్తె సంధ్య (19)కు కనగల్ మండలం బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పర్సనబోయిన రమేష్‌తో గత మేలో వివాహం జరిగింది. సంధ్యకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవటంతో పెళ్లయిన నాటి నుంచి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఈక్రమంలో దసరా పండుగకు పుట్టింటికి వెళ్లిన ఆమె.. ఆదివారం బచ్చన్నగూడెం వచ్చింది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో మృతురాలి సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఏం రాసి ఉందనే వివరాలను వెల్లడించలేదు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
సూర్యాపేటటౌన్ : గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం సూర్యాపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రిథిక హోటల్ సమీపంలో సోమవారం ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అతడిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. తాను ఖమ్మం జిల్లా మధిర అని, కోదాడకు వెళ్లాల్సి ఉందని వృద్ధుడు ఫుడ్ షాపు సిబ్బందికి చెప్పినట్లు తెలిసింది. అనారోగ్యంతోపాటు, ఆహారం లేకపోవడంతో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసినవారు సూర్యాపేట టౌన్ పోలీసులను సంప్రదించాలని సీఐ వెంకటయ్య కోరారు.


