గడ్డి అసలే దొరకడం లేదు
ఈ చిత్రంలోని మహిళా రైతు నెలకంటి అండాలు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని అరెగూడెం గ్రామం. ఈమెకు రెండు గేదెలు, ఒక ఆవు ఉంది. రెండు గేదెలు రోజుకు తొమ్మిది లీటర్ల చొప్పున పాలు ఇచ్చేవి. ఆవు రెండు లీటర్ల పాలు ఇచ్చేది. రోజుకు 600 ఆదాయం వచ్చేది. పశువులకు గడ్డి లేకపోవడం, దాణా ఖర్చులు పెరగడంతో పశువులను అమ్ముకుంది. రూ.90 వేల నుంచి లక్ష వరకు ధర పలికే గేదెను మేత కొరత కారణంగా రూ.50 వేలకే, మరో గేదెకు రూ.80 వేల వరకు ధర పలికే అవకాశం ఉన్నప్పటికీ రూ.45 వేలకే, రూ.50 వేల విలువ చేసే ఆవును సైతం రూ.25 వేలకే అమ్మింది. ప్రస్తుతం తన సొంత చెల్కలోనే పత్తి తీత పనులు చేసుకుంటుంది.
ఈమె మారమ్మ. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామం. ఈమెకు 5గేదేలు ఉన్నాయి. ప్రతి రోజు 15 నుంచి 17లీటర్లు పాలు అమ్ముతుండేది. పశువులకు సరిపడా గడ్డి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 5గేదెలకు 3గేదెలు అమ్ముకుంది. ప్రస్తుతం 2లీటర్ల పాలు అమ్ముతుంది. మేత లేకపోవడంతో 200 గడ్డి మోపులు కొనుగోలు చేసింది.
వర్షాభావంతో
తీవ్ర పశుగ్రాస కొరత
● ఆకాశాన్నంటిన దాణా, ఎండుగడ్డి ధర
● పాలు లేక మూతపడుతున్న
సేకరణ కేంద్రాలు
● మేపలేక.. సగం ధరకే
పశువులను అమ్ముకుంటున్న ౖరైతులు
సంస్థాన్ నారాయణపురం : తీవ్ర వర్షాభావ పరిస్థితులు పాడి రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. పశుగ్రాసం కొరతతో పాడి పశువులను పోషించలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటు పంటలు పండక, ఇటు పాడి ద్వారా ఆదాయం రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో కురిసిన చిరుజల్లులు నేలను తడిపాయే తప్ప పచ్చిక పెరిగేందుకు సరిపోలేదు. పచ్చిగడ్డి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా పశువులకు సరిపడా మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. వానకాలం లోటు వర్షపాతం వ్యవసాయంతో పాటు పశుగ్రాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాణా, ఎండుగడ్డి కొనుగోలు చేసి పశువులను పోషించడం చిన్న, సన్నకారు రైతులకు భారంగా మారింది. పాల ద్వారా వచ్చే ఆదాయం కంటే పోషణ ఖర్చులే రెట్టింపు అవుతుండటంతో చేసేదేమీ లేక రైతులు తమ జీవనాధారమైన పశువులను అమ్ముకుంటున్నారు.
గడ్డి కొనుగోలు భారం
పశువులను అమ్ముకోలేని రైతులు అప్పు చేసి ఎండుగడ్డి కొనుగోలు చేస్తున్నారు. పచ్చిగడ్డి అందుబాటులో ఉంటే ఒక మోపు గడ్డి మూడు రోజులు వచ్చేది, కానీ ఇప్పుడు ఒక్క మోపు ఎండుగడ్డి రెండు రోజులకే సరిపోతోంది. రెండు గేదెలు ఉన్న రైతు సాధారణంగా వర్షాకాలం, ఎండాకాలం కలిపి 200 మోపుల ఎండుగడ్డి కొనుగోలు చేస్తుంటాడు. రవాణా ఖర్చులతో కలిపి ప్రస్తుతం ఒక గడ్డి మోపు ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. వర్షాలు లేక వరి చేన్లు ఎండిపోవడంతో రానున్న రోజుల్లో వరి గడ్డికి మరింత కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.
సరైన పోషకాహారం అందక..
వర్షాలు లేక గడ్డి మొలకెత్తకపోవడంతో పశువులు ఎండుగడ్డి, ఇతర దాణాపైనే ఆధారపడాల్సి వస్తోంది. సరైన పోషకాహారం అందక పాల దిగుబడి నిలువునా పడిపోతోంది. మూడు నెలల క్రితం రూ.800 ఉన్న 50 కేజీల దాణా బస్తా ధర క్రమక్రమంగా పెరిగి రూ.1,300కు చేరింది. రోజుకు అర కేజీ దాణా చొప్పున వేసే రైతుకు రెండు గేదెలు ఉంటే నెలకు రూ.500 అదనపు భారం పడుతోంది.
పశుగ్రాసం దొరక్క ఆవును అమ్ముదామని మార్కెట్కు తీసుకెళ్తే రూ.80 వేలు విలువ చేసే దానిని రూ.30 వేలకే అడుగుతున్నారు. అంత తక్కువ ధరకు మనసొప్పక అమ్మలేదు. చివరికి రూ.20 వేల విలువైన దూడను రూ.13 వేలకే అమ్ముకున్నాను. వర్షాలు లేక గడ్డి అసలే దొరకడం లేదు.
– చిన్నూరి అంజయ్య, రైతు, అరెగూడెం


