రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండల పరిధిలోని ముషంపల్లి గ్రామంలో వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సంబంధించిన వైర్లు వరుసగా చోరీకి గురికావడం స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత మూడు నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో పొలాల్లోని మోటార్లకు అమర్చిన ఖరీదైన వైర్లను అపహరించడం రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
అక్కడే కాల్చేసి..
ఈ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. రాత్రి వేళల్లో ఎవరి కంట పడకుండా పొలాల్లోకి చొరబడుతున్న దుండగులు, వ్యవసాయ స్టార్టర్ నుంచి మోటార్లకు బిగించిన విద్యుత్ వైర్లను కత్తిరిస్తున్నారు. ఆ వైర్లను యథాతథంగా తీసుకెళ్తే బరువు, రవాణా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సమీపంలోని పొదల్లో మంట పెట్టి కాలుస్తున్నారు. ప్లాస్టిక్, రబ్బరు కోటింగ్‌ను పూర్తిగా దగ్ధం చేసి, లోపల ఉండే రాగి తీగలను మాత్రమే ముద్దగా మార్చుకుని సులభంగా ఎత్తుకెళ్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా, సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు.
పంటలకు నీరందని పరిస్థితి
ఒకవైపు వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో ఎంతో కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలకు ఈ దొంగతనాలు పెనుభారంగా మారాయి. మోటారు వైరు చోరీకి గురైన ప్రతిసారి వేలాది రూపాయలు వెచ్చించి కొత్త వైర్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు తెగిపోవడంతో సకాలంలో పంటలకు నీరు అందక పైర్లు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. రాత్రి సమయాల్లో పొలాల వద్ద కాపలా కాయాలన్నా దొంగల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పొలాల వద్ద రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్ లేకపోవడం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా నిఘా పెంచి, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, దొంగల ముఠాను తక్షణమే పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని ముషంపల్లి రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ మోటార్ల వైర్లను కాల్చేసి
రాగి తీగలతో పరారు
రైతులపై ఆర్థిక భారం


