యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వారాంతపు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో శ్రీనృసింహుడి ధర్మ దర్శనానికి 3గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో శ్రీస్వామిని దర్శించుకునేందుకు రావడంతో ఆలయ పరిసరాలు, మాడ వీధులు, ఆధ్యాత్మిక వాడ, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు నిండుగా కనిపించారు. శ్రీస్వామిని సుమారు 35వేలమందికి పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీలక్ష్మీనృసింహస్వామికి నిత్యాదాయం రూ. 39,38,712 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
స్వర్ణగిరి క్షేత్రంలో చిన్న శేషవాహనసేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామిదేవాలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలువ రోజు స్వామి వారికి ఆలయ మాడ వీధుల్లో చిన్న శేషవాహన సేవ నిర్వహించారు, సాయంత్రం సర్వభూపాల వాహన సేవ జరిపించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సహస్రనామార్చన సేవ చేపట్టారు. అదేవిధంగా స్వామివారిని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు కుటుంబ సభ్యులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధ్యయనత్సోవ మండపంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. లోక కల్యాణం సమస్త ప్రాణులు, వర్షాల కోసం స్వర్ణగిరి క్షేత్రంలో వరుణ యాగం నిర్వహించాలని మంగళశాసనం చేశారు. రెండు రోజుల్లో స్వర్ణగిరి క్షేత్రంలో వరుణ యాగం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ, గోపి కృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.


