మునుగోడు (మర్రిగూడ): మర్రిగూడ మండలంలోని బట్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుతో శుక్రవారం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలో మొత్తం 17 మంది విద్యార్థులకు 13 మంది హాజరయ్యారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు సెప్టెంబర్ 2 నుంచి ప్రసూతి సెలవులో (మెటర్నిటీ లీవ్) ఉండగా, ప్రధానోపాధ్యాయుడు శుక్రవారం సెలవు పెట్టారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల బాధ్యతను అటెండరే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఉదయమే నమోదు చేయాల్సిన విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) హాజరు ఫొటోలను.. మధ్యాహ్నం 2 గంటల తరువాత సీఆర్‌పీ కృష్ణ పాఠశాలకు వచ్చి తీయడం గమనార్హం. ఉపాధ్యాయుడు సెలవు తీసుకుంటున్న విషయాన్ని తనకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రూప్‌సింగ్ పేర్కొన్నారు. టీచర్లు సెలవులో ఉన్నప్పుడు విద్యార్థుల భద్రత, బోధనకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల గైర్హాజరుపై స్థానిక ఎంఈఓ శారదను సంప్రదించగా ఆమె స్పందించలేదు.
ఒకరు ప్రసూతి సెలవు..
మరొకరు ఆకస్మిక లీవ్
విద్యార్థుల బాధ్యత చూసుకున్న అటెండర్


