కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు వరదనీటి రాక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండు రోజులుగా మూసీకి వరద వస్తోంది. శుక్రవారం 3వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో శుక్రవారం సాయంత్రానికి 641.60 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం మూసీ కుడి ప్రధాన కాల్వకు 138 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 254 క్యూసెక్కుల చొప్పున మొత్తం 392 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగితే రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గొర్రెలు, పశువుల కాపరులు, రైతులు, జాలర్లు మూసీ వాగులోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.


