మార్కెట్‌లో పోటీ పెరిగింది
ఉపాధి పరంగా ఆందోళన కలిగిస్తోంది
రామగిరి(నల్లగొండ): ఒకప్పుడు రాజకీయ సభలు, వివాహాలు, జన్మదిన వేడుకలు, వ్యాపార ప్రకటనలు.. ఏవైనా సరే బ్యానర్లు, ఫ్లెక్సీల కోసం ప్రింటింగ్ షాపులకు వెళ్లేవారు. గ్రాఫిక్ డిజైనర్లు గంటల తరబడి శ్రమించి వాటిని రూపొందించేవారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఏఐ ఆధారిత సాధనాలు ప్రింటింగ్, ఫ్లెక్సీ వ్యాపారాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి.
పడిపోతున్న రాబడి
సాధారణ డిజైనింగ్ పనులకు డిజైనర్ల అవసరం క్రమంగా తగ్గుతోంది. కొందరు వ్యాపారులు, వినియోగదారులు తమ ఫోన్లలోనే ఏఐ యాప్‌ల ద్వారా స్వయంగా బ్యానర్లు, ఆహ్వాన పత్రాలు డిజైన్ చేసుకుంటున్నారు. షాపులకు వెళ్లి కేవలం ప్రింటింగ్ మాత్రమే చేయించుకుంటుండంతో డిజైనింగ్ ద్వారా వచ్చే అదనపు రాబడి పడిపోయి, చిన్న స్థాయి ఫ్లెక్సీ షాపులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి.
పర్యావరణ నిబంధనల తోడు
ఏఐ సాంకేతికతతో పాటు ప్లాస్టిక్ నివారణలో భాగంగా సింగిల్ యూజ్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం విధిస్తున్న నిషేధం కూడా ఈ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో కస్టమర్లు కంపోస్టబుల్ క్లాత్ (కాటన్) బ్యానర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిజిటల్, కాటన్ ప్రింటింగ్ వైపు మారడం షాపు యజమానులకు తప్పనిసరిగా మారింది.
పరిమితమైన సిబ్బందితోనే ఎక్కువ పని
గతంలో ఒక డిజైన్ పూర్తి చేయడానికి డిజైనర్‌కు 2 నుంచి 3 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఇమేజ్ జనరేటర్ల సాయంతో కొద్ది సెకన్లలోనే నాణ్యమైన కాన్సెప్ట్‌లు, బ్యాక్‌గ్రౌండ్లు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లు ఇచ్చే స్పష్టత లేని ఫొటోలను సైతం ఏఐ క్లారిటీ టూల్స్ సాయంతో హై క్వాలిటీగా మార్చడం సులభమైంది. దీనివల్ల పరిమితమైన సిబ్బందితోనే ఎక్కువ పని పూర్తి చేసేందుకు షాపు యజమానులకు వీలవుతోంది.
ఫోన్‌లోనే సొంతంగా జన్మదిన వేడుకలు, వ్యాపార ప్రకటనల బ్యానర్ల డిజైన్
ప్రింటింగ్ కోసమే షాపులను
ఆశ్రయిస్తున్న వినియోగదారులు
గ్రాఫిక్ డిజైనర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం
ఏఐ యాప్‌ల వల్ల చాలామంది కస్టమర్లు ఫోన్లలోనే డిజైన్లు చేసుకుని, కేవలం ప్రింటింగ్ కోసమే వస్తున్నారు. దీనివల్ల మార్జిన్ తగ్గింది. అందుకే మేం కూడా ఏఐ టూల్స్ నేర్చుకుని, వేగంగా ఆర్డర్లు పూర్తి చేస్తున్నాం. ఎల్‌ఈడీ బోర్డులు, డిజిటల్ బ్రాండింగ్ వంటి కొత్త సేవలు ప్రారంభించాం.
– సురేష్, ఫ్లెక్సీ షాపు యజమాని
గతంలో డిజైన్ కోసం బ్యాక్‌గ్రౌండ్స్ వెతకడం, ఎడిటింగ్‌కు గంటలు పట్టేది. ఏఐతో సమయం ఆదా అవుతోంది. అయితే సాధారణ డిజైనింగ్ పనులకు ఆదరణ తగ్గడం ఉపాధి పరంగా ఆందోళన కలిగిస్తోంది. స్థానిక సంస్కృతి, కస్టమర్ ఆలోచనలకు తగ్గట్టుగా మానవ మేధస్సుతోనే క్రియేటివిటీ జోడించగలమని నమ్ముతున్నాం.
– విశ్వరూప చారి, గ్రాఫిక్ డిజైనర్


