గుర్రంపోడు : ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించి, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటిస్తోంది. తోటల పెంపకానికి మొక్కలు, డ్రిప్, అంతరపంటల సాగు, ఎరువుల ఖర్చు కోసం నాలుగేళ్ల పాటు హెక్టారుకు రూ.51 వేలు ఇస్తుండగా.. తాజాగా సాగు, కోత పరికరాలపై కూడా సబ్సిడీలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు నీటి కుంటల నిర్మాణం, ఆధునిక పరికరాల కొనుగోళ్లకు జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా రాయితీలు అందిస్తున్నారు.
నీటి కుంటకు రూ.90 వేలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ పామ్ తోటల్లో నీటి లభ్యతను మెరుగుపర్చేందుకు, వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు నీటి కుంటల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. నిర్దేశించిన కొలతలతో నిర్మించే ఒక్కో నీటి కుంటకు రూ.90 వేలు అందిస్తారు. కుంట అడుగుభాగం 14.14 మీటర్లు, లోతు 3.50 మీటర్లు, మధ్యభాగం 20.20 మీటర్లు , పై భాగం 21.21 మీటర్లు ఉండాలి . ఈ పరిమాణంలో 9 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయిల్‌పామ్ తోటల్లో నీటి అవసరాలు తీర్చేందుకు కుంటలు ఉపయోగపడతాయని అధికారులు సూచిస్తున్నారు.
పరికరాలపై రాయితీ ఇలా..
కట్టర్ : గెలలు కోసే 50 అడుగుల పొడవు ఉండే కట్టర్ (టెలిస్కోపిక్ హర్వెస్టింగ్ పోల్)పై మొత్తం బిల్లులో 50 శాతం రాయితీగా రూ.2500 రాయితీ అందిస్తారు.
మోటరైజ్డ్ చిసెల్
ఎత్తయిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసే మోటారు యంత్రం కొనుగోలుకు బిల్లులో 50 శాతం రాయితీగా గరిష్టంగా రూ.15 వేలు రాయితీ అందిస్తారు.
అల్యూమినిమం పోర్టల్ నిచ్చెన
21,30 అడుగులు ఉండే అల్యూమినియం నిచ్చెనల కొనుగోలుకు బిల్లులో యాభై శాతం రాయితీగా గరిష్టంగా రూ.5 వేల రాయితీ ఉంటుంది.
చాప్ కట్టర్
ఆయిల్ పామ్ మట్టలు, ఇతర వ్యర్ధాలను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించడానికి వాడే యంత్రం కొనుగోలుకు బిల్లులో యాభై శాతం గరిష్టంగా రూ.50 వేల రాయితీ అందిస్తారు.
దరఖాస్తు చేసుకోవాలి
ఆయిల్ పామ్ సాగు రైతులు నీటి కుంటలు, అవసరమైన పరికరాల కోసం ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలి. మంజూరు లభించిన తర్వాత పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి రాయితీలను అందిస్తాం. – మురళీ
ప్రాంతీయ ఉద్యానవన శాఖాధికారి
పరికరాల కొనుగోలుపై 50శాతం సబ్సిడీ
నీటి కుంటలకు రూ.90 వేల ప్రోత్సాహకం


