వ్యాపారులపై ట్రాఫిక్‌ చలాన్ల మోత | - | Sakshi
Sakshi News home page

వ్యాపారులపై ట్రాఫిక్‌ చలాన్ల మోత

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీసుల తీరు వ్యాపారులకు, స్థానిక ప్రజలకు శాపంగా మారింది. ట్రాఫిక్‌ నియంత్రణను పక్కనబెట్టి, కేవలం చలాన్లు విధించడమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ టార్గెట్లు పూర్తి చేసుకోవడమే ధ్యేయంగా దొంగచాటుగా సెల్‌ఫోన్లలో ఫొటోలు తీస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అండర్‌పాస్‌ పనులతో మూడేళ్లుగా నష్టాలు

పట్టణంలో జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లుగా సాగుతోంది. పనులు నత్తనడకన సాగుతుండటంతో జాతీయ రహదారి వెంట ఉన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అద్దెలు కూడా చెల్లించలేక పలువురు దుకాణాలు మూసివేయగా, మరికొందరు గల్లీల్లోకి మకాం మార్చారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వ్యాపారం చేసుకుంటున్న వారికి ట్రాఫిక్‌ పోలీసుల చలాన్ల వేధింపులు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.

సర్వీస్‌ రోడ్లే దిక్కు..

అండర్‌పాస్‌ పనుల వల్ల ప్రధాన రహదారి మూతపడటంతో వాహనాలన్నీ సర్వీస్‌ రోడ్ల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో హోల్‌సేల్‌ డీలర్లు, ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చే వాహనాలు తప్పనిసరి పరిస్థితుల్లో సర్వీస్‌ రోడ్డుపైనే వాహనాలు నిలిపి సరుకులు దింపాల్సి వస్తోంది. అయితే ప్రత్యామ్నాయం లేదన్న విషయం తెలిసి కూడా పోలీసులు రాంగ్‌ పార్కింగ్‌ పేరుతో చలాన్లు బాదుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేవలం బస్టాండ్‌, తంగడపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద మాత్రమే పరిమితమైన ఈ చలాన్ల గోల.. ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి వలిగొండ క్రాస్‌ రోడ్డు వరకు పట్టణమంతా విస్తరించింది. ఇటీవల స్థానిక హోల్‌సేల్‌ వ్యాపారికి చెందిన ఓ సరుకు రవాణా వాహనానికి గత రెండు నెలల్లోనే ఏకంగా 23 చలాన్లు విధించారు. వీటి ద్వారా రూ.6,105 పెండింగ్‌లో ఉండగా, ఈ నెలలో పడిన మరిన్ని చలాన్లు కలిపితే ఆ మొత్తం రూ.10 వేలు దాటేలా ఉంది.

సరుకు రవాణా వాహనాలపై

ఇష్టానుసారంగా జరిమానాలు

నో పార్కింగ్‌, రాంగ్‌ పార్కింగ్‌

పేరుతో ఫొటోలు

చౌటుప్పల్‌లో వాహనం బయటకు

తీయాలంటేనే జంకుతున్న దుకాణదారులు

వెసులుబాటు కల్పిస్తాం

చౌటుప్పల్‌లో అండర్‌పాస్‌ పనుల వల్ల నెలకొన్న పరిస్థితులు మా దృష్టికి వచ్చాయి. వ్యాపారులు సరుకులు దిగుమతి చేసుకునేందుకు నిబంధనల ప్రకారం వెసులుబాటు కల్పిస్తాం. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే వేళల్లో కాకుండా, మిగతా సమయాల్లో సరుకులు దింపుకోవడానికి చర్యలు తీసుకుంటాం.

– ప్రభాకర్‌ రెడ్డి, డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement