వలిగొండ :
మండల కేంద్రంలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి శుక్రవారం వలిగొండలోని సంజయ్ బెంగళూరు బేకరీ, శ్రీ రాజశ్యామల హోటల్ అండ్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. కేక్ తయారీ ప్రాంతం, హోటల్ వంటగది, రిఫ్రిజిరేటర్లు సక్రమంగా శుభ్రపరచకపోవడంతో స్వీట్లు, పఫ్‌లు, కేక్ క్రీములు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. పలు పదార్థాల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. ఆహార భద్రత ప్రమాణాలను పాటించని వారికి నోటీసులు జారీ చేశారు.
చెన్నాయిపాలెం రేషన్ డీలర్ సస్పెన్షన్
మఠంపల్లి : మండలంలోని చెన్నాయిపాలెం రేషన్ దుకాణం (నెం.8) డీలర్ భూక్యా అనితను సస్పెండ్ చేస్తూ ఆర్డీఓ శ్రీనివాసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీలర్ అనితకు పాలకీడు మండలం దేవ్లాతండాకు చెందిన మాలోతు రాజేష్‌తో ఈ ఏడాది మే 6వ తేదీన వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె గ్రామంలో అందుబాటులో ఉండటం లేదని, ఆమె కుటుంబ సభ్యులే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. డీలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఆమెను సస్పెండ్ చేసి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసే బాధ్యతను డీలర్ వడిత్యా శ్రీనుకు అప్పగించినట్లు ఆర్డీఓ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


