జింక్‌ లోపం నివారిస్తేనే మంచి దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

జింక్‌ లోపం నివారిస్తేనే మంచి దిగుబడులు

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

గుర్రంపోడు : పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం తగ్గిపోవడం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులు ఎక్కువగా నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఉండే రసాయన ఎరువుల మీదే ఆధారపడుతుండటంతో నేలలో సూక్ష్మపోషకాల లోపాలు ఏర్పడుతున్నాయి. తక్కువ పరిమాణంలోనే అవసరమైనా.. పైరు ఎదుగుదలకు, మంచి దిగుబడులకు జింక్‌, బోరాన్‌, మెగ్నీషియం తదితర పోషకాలు ఎంతో కీలకం. ముఖ్యంగా వరి మాగాణుల్లో జింక్‌ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని సకాలంలో గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని గుర్రంపోడు వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు.

లోపానికి కారణాలు ఇవే..

వరిలో జింక్‌ లోపం రావడానికి ప్రధాన కారణం సేంద్రియ ఎరువుల వినియోగం లేకపోవడమే. కేవలం పెసర, అలసంద, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియదున్నడం మినహా, సేంద్రియ ఎరువుల వాడకం నామమాత్రంగానే మారింది. వరి సాగు చేసే నేలల్లో చౌడు ఉండటం మరో ముఖ్య కారణం. చౌడు వల్ల నేలలో ఉన్న జింక్‌ మొక్కలకు సులభంగా అందుబాటులోకి రాదు. దీనికి తోడు రసాయనిక ఎరువులను అసమతుల్యంగా వాడటం, పొలంలో మురుగు నీరు సరిగా బయటకు వెళ్లకపోవడం, వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కూడా జింక్‌ లోపం కనిపిస్తుంది. నేలలో జింక్‌ లోపం ఉంటే.. రసాయన ఎరువులను తీసుకునే శక్తి మొక్కకు తగ్గిపోయి, ఆ ఎరువులన్నీ వృథా అవుతాయి. నాటిన పైరు అనారోగ్యంగా, కళతప్పి కనిపిస్తుంది. పిలకలు ఆలస్యంగా రావడమే కాకుండా తక్కువగా వస్తాయి. వచ్చిన పిలకలు కూడా సరిగా ఎదగక పైరు గిడసబారిపోతుంది. లేత ఆకులు ఈనెల మధ్య భాగంలో పసుపు రంగులోకి మారిపోతాయి. జింక్‌ లోపం తీవ్రంగా ఉన్నచోట అడుగు ఆకులు ఎండిపోతాయి. తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.

నివారణ చర్యలు..

పంటకు అవసరమైన పోషకాల్లో కనీసం 30 శాతం సేంద్రియ ఎరువుల ద్వారా (పశువుల ఎరువు, జీవన ఎరువులు) అందించాలి. సేంద్రియ ఎరువులు అందుబాటులో లేనప్పుడు, వరి నాటడానికి ముందు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ను వేసుకోవాలి. దమ్ములో జింక్‌ సల్ఫేట్‌ వేసినప్పుడు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు. జింక్‌ సల్ఫేట్‌ వేయడానికి ముందు గానీ, లేదా తర్వాత గానీ రసాయన ఎరువులు వేయడానికి కనీసం నాలుగు రోజుల విరామం ఉండాలి. జింక్‌ సల్ఫేట్‌ను ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లకు కలిపి ఏడాదొకసారి వేస్తే సరిపోతుంది. దమ్ములో జింక్‌ సల్ఫేట్‌ వేయని పొలాల్లో.. వరి నాటిన తర్వాత ఈ లోపం కనిపిస్తే పిచికారీ ద్వారా నివారించుకోవచ్చు. లీటరు నీటికి 2 గ్రాముల శ్రీచిలేటెడ్‌ జింక్‌శ్రీ చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. అవసరమైతే 20 రోజుల వ్యవధిలో మరోసారి అదే మోతాదులో పిచికారీ చేయాలి. జింక్‌ను పిచికారీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు మందులు లేదా తెగుళ్ల మందులతో కలిపి కొట్టకూడదు. చౌడు నేలల్లో జింక్‌ సల్ఫేట్‌ను దమ్ములో వేయడం కంటే, పైరుపై రెండు దఫాలుగా పిచికారీ చేసుకోవడమే లాభదాయకం.

ఫ గుర్రంపోడు వ్యవసాయాధికారి

కంచర్ల మాధవరెడ్డి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement