మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెం గ్రామ శివారులో క్రిష్టాపురం వెళ్లే రహదారి పక్కన ఉన్న శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రక వట (మర్రి) వృక్షం నేలకూలింది. రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు గురువారం తెల్లవారుజామున ఈ భారీ చెట్టు వేర్లతో సహా రోడ్డుపై అడ్డంగా పడింది. గ్రామంలో ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు, ఎడ్ల పందేలు, కబడ్డీ పోటీలు, తాడులాగుడు పోటీలు, నాటక ప్రదర్శనలు.. అంతేకాకుండా ఊరి పెద్దల పంచాయతీలు, రచ్చబండ తీర్పులకు ఈ మర్రిచెట్టే సాక్షీభూతంగా నిలిచింది. ఎన్నో భారీ గాలివానలను తట్టుకుని నిలబడిన తమ ఊరి పెద్ద చెట్టు నేలవాలిపోవడంతో గ్రామస్తులు విచారవదనాలతో కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే సర్పంచ్ కమనీ నరసింహారావు, ఉప సర్పంచ్ రమణా శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రయ్యలతో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని చెట్టును పరిశీలించారు. అనంతరం సర్పంచ్ కమనీ నరసింహారావు సహకారంతో పంచాయతీ సిబ్బంది జేసీబీలు, రంపాలతో చెట్టు కొమ్మలను తొలగించి, రోడ్డుకు అడ్డంగా ఉన్న భాగాన్ని క్లియర్ చేసి రాకపోకలను పునరుద్ధరించారు.


