భువనగిరి: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు, వృద్ధులు, వికలాంగుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం తాజాగా ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వాస్తవానికి జూన్ 2నవీటిని ఇస్తారని భావించినా మంజూరు కాలేదు. ఈసారైనా తమ ఆశ నెరవేరుతుందని భావిస్తున్నారు.
నాలుగేళ్లుగా నిరీక్షణ
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులు దాదాపు నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్టోబర్ 2022లో మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే చివరిసారిగా కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినప్పటికీ.. దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయలేదు. రెండేళ్లుగా కేవలం హామీలకే పరిమితం కావడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ప్రస్తుతం 96,425 మంది లబ్ధిదారులు
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 96,425 మంది లబ్ధిదారులు చేయూత పథకం కింద పింఛన్ పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.24.50 కోట్లను పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా బాధితులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు ఉన్నారు. వీరంతా జీవించే ఉన్నారా? లేదా? అన్న విషయమై అధికారుల గత నెలలో లైఫ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. అయితే కొందరు స్థానికంగా లేకపోవడం, మరికొందరు మృతి చెందినట్లు గుర్తించారు.
పెండింగ్‌లో 28వేలకు పైగా దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ‘ప్రజాపాలన’ సభల ద్వారా పింఛన్ల కోసం జిల్లాలో సుమారు 28,652 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆన్‌లైన్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరికీ మంజూరు చేయలేదు. ఇవి కాకుండా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణితో పాటు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలకు సైతం వెళ్లి నేరుగా దరఖాస్తులు అందజేశారు. అయితే ఆగస్టు 15 నుంచి పింఛన్లు ఇస్తామన్న ప్రకటన సంతోషం కలిగిస్తున్నా.. ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ఇప్పటికే ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుదారులకే మంజూరు చేస్తారా? లేక కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తారా? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ కొత్త వారికి అవకాశం ఇస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
ఫ 15 నుంచి మంజూరు
చేస్తామన్న ప్రభుత్వం
ఫ జిల్లాలో 28,652కు పైగా
పెండింగ్ దరఖాస్తులు


