హాలియా : వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న వ్యవసాయ బావిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. శనివా రం హాలియా పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న త్రిపురారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో లభ్యమైన చెప్పులు, చీర పిన్నులతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా మృతురాలు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన తిరుపతమ్మ(40) పోలీసులు గుర్తించారు. హాలియా సీఐ సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలు తిరుపతమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేసిన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దజత్రం గ్రామానికి చెందిన కూలూర్ లింగప్పను శనివారం ఉదయం పెద్దవూర మండల పరిధిలోని సమ్మక్క, సారక్క జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఉరి వేసి.. బావిలో పడేసి..
తిరుపతమ్మ గొర్రెలు మేపేందుకు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లగా.. అదే ప్రాంతంలో కూలూర్ లింగప్పతో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. తిరుమతమ్మ భర్త కూర్మప్పకు అనుమానం రావడంతో ఆంధ్రా నుంచి సొంతూరుకు వెళ్లారు. భర్తతో కలిసి ఉండలేని తిరుపతమ్మ కొద్దిరోజుల తర్వాత ఇంట్లో ఎవరికీ చెప్పకుంగా వెళ్లిపోగా ఆమె భర్త కూర్మప్ప దేవరకద్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూలూర్ లింగప్పతో తిరుపతమ్మ ఉండగా ఆమెను తీసుకొచ్చి భర్త కూర్మప్పకు అప్పగించారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 20 నెలల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా మరోసారి తిరుపతమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నాటి నుంచి తిరుపతమ్మ లింగప్పతోనే సహజీవనం చేస్తూ సుమారు 20 నెలల పాటు ఆంధ్రా ప్రాంతంలోని దుర్గి గ్రామంలో ఉంది. గత నెల లింగప్పకు వేరే మహిళతో వివాహం జరిగింది. నాటి నుంచి తిరుపతమ్మ, లింగప్ప మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఎలాగైనా తిరుపతమ్మను అడ్డును తొలగించుకోవాలనే లింగప్ప పథకం వేశాడు. గత నెల 27న లింగప్ప మాచర్లకు వెళ్లి తిరుపతమ్మను తీసుకొచ్చి కొండమల్లేపల్లి, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం గత నెల 29న త్రిపురారం గ్రామ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక వ్యవసాయ బావి వద్దకు తిరుపతమ్మను లింగప్ప తీసుకొచ్చాడు. తిరుపతమ్మను మాటల్లోకి దించి ఆమె రెండు చేతులను వెనక్కి పెట్టి చున్నీతో కట్టేసి, మెడకు చీరతో ఉరి వేశాడు. అంతేకాకుండా చీర అంచున ఒక బండరాయి కట్టి ఆమెను బావిలో పడేసి అక్కడి నుంచి పారిపోయినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి మృతురాలి సెల్‌ఫోన్, బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐలు నరేష్, విజయ్‌కుమార్, సాయి ప్రశాంత్‌తో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రాజశేఖరాజు అభినందించారు.
చున్నీతో చేతులు కట్టేసి, మెడకు
చీర బిగించి మహిళ హత్య
నిందితుడి అరెస్ట్
వివరాలు వెల్లడించిన
మిర్యాలగూడ డీఎస్పీ
రాజశేఖరరాజు


