నల్లగొండ, మిర్యాలగూడ : మసీదు స్థల వివాదానికి సంబంధించిన సర్వే నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన వక్ఫ్ బోర్డు ఇన్స్‌పెక్టర్ ఏసీబీ వలలో చిక్కాడు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండల కేంద్రంలోని జామె మసీద్ అబూబకర్ సిద్ధిఖ్ రెహమతుల్లా అలాయ్ మసీదుకు సంబంధించిన 900 గజాల స్థలంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థలాన్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుని రక్షించాలని కోరుతూ మసీదు నిర్వాహకుడు రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆశ్రయించాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నల్ల గొండ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మహమూద్ గత నెలలో సర్వేయర్‌తో కలిసి స్థలాన్ని సర్వే చేశారు. దీనికి సంబంధించి నివేదికను వక్ఫ్ బోర్డు సీఈఓకు పంపించాల్సి ఉంటుంది. అయితే సర్వే పూర్తయినప్పటికీ నివేదికను అందించకుండా రూ.10వేలు లంచం ఇస్తేనే రిపోర్టు ఇస్తానంటూ మసీదు నిర్వాహకుడిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారి సూచనల మేరకు శనివారం మిర్యాలగూడ బస్టాండ్‌లో రూ.10వేల లంచం మహమూద్‌కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు మహమూద్‌ను పట్టుకున్నారు. మహమూద్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ తెలిపారు.
కార్యాలయంలో రికార్డుల తనిఖీ..
ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నల్లగొండ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని జిల్లా వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.
అవినీతిపై ఫిర్యాదు చేయండి..
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని, ఫోన్, సోషల్ మీడియా వేదికలు, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.
మసీదు స్థలానికి సంబంధించిన
సర్వే రిపోర్టు ఇచ్చేందుకు
రూ.10వేలు లంచం డిమాండ్
ఏసీబీ అధికారులను
ఆశ్రయించిన బాధితుడు
లంచం తీసుకుంటుండగా
రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత


