పెన్‌పహాడ్ : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఈ–మ్యాగజైన్ ఎడుస్యూర్ సంచికలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనాజిపురంలోని తెలంగాణ మోడల్ స్కూల్ చోటు సంపాదించింది. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఎక్స్‌ప్లోరింగ్ ది యూనివర్స్ ఇన్‌స్పైరింగ్ యంగ్ మైడ్స్ అనే థీమ్‌తో గతేడాది నిర్వహించిన వరల్డ్ స్పేస్ వీక్–2025 కార్యక్రమాలను ఈ మ్యాగజైన్ ప్రచురించింది. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య వివరాలను వెల్లడించారు. ఎడుస్యూర్ తాజా సంచిక 24, 25 పేజీల్లో తమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల విశిష్టతను తెలియజేస్తూ ప్రత్యేక కథనం ప్రచురించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని రేకెత్తించాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఈ కార్యక్రమాలను చేపట్టినా అనాజిపురం మోడల్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాలు ఉత్తమంగా ఎంపికై ఎడుస్యూర్ మ్యాగజైన్‌లో కథనంగా ప్రచురితమవడం పాఠశాల విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచినట్లు ఆయన తెలిపారు.


