చివ్వెంల(సూర్యాపేట): విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి చెందిన వీరబోయిన సైదులు(32) మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. బోరు మోటార్లు పోయకపోవడంతో ట్రాన్స్‌పార్మర్ వద్ద ఫ్యూజులు ఏమైనా పోయాయా అని చూడటానికి వెళ్లాడు. ట్రాన్స్‌పార్మర్‌ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి సైదులును ఆటోలో సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


