మినీ ఎయిమ్స్‌పై నీలినీడలు
వెనక్కి వెళ్లిన నిధులు
అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చాం
బొమ్మలరామారం: మినీ ఎయిమ్స్‌గా పిలిచే రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్(ఆర్‌హెచ్‌టీసీ) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బొమ్మలరామారంలోని ఈ ఆర్‌హెచ్‌టీసీ భూ బదలాయింపు ప్రక్రియ మూడేళ్లుగా కొలిక్కిరావడంలేదు. కేటాయించిన భూమి మార్కెట్ విలువ రూ.80లక్షలు ఉండడంతో ఈ అంశం కలెక్టర్ పరిధిలో లేక ఎటూ తేలడంలేదు. దీనికి సంబంధించిన ఫైల్ కలెక్టరేట్‌లోనే మూలుగుతోంది. నిర్మాణం కోసం ఇప్పటికే రెండు పర్యాయాలు వచ్చిన నిధులు వెనక్కి వెళ్లాయి. దీంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఈ సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి.
నాలుగేళ్లుగా ..
ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్.. బొమ్మలరామారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని దత్తత తీసుకుంది. ఇందులో రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్‌హెచ్‌టీసీ) ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా నాలుగేళ్లుగా ఎయిమ్స్ డాక్టర్లు ఈ పీహెచ్‌సీకి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు.
పది ఎకరాలు కావాలని..
గతంలో బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న వికాస్ భాటియా బొమ్మలరామారంలో మినీ ఎయిమ్స్ ఏర్పాటుకు 10 ఎకరాల భూమి కేటాయించాలని 2021లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మల్యాలలోని 199 సర్వే నంబర్‌లోగల 6 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2022డిసెంబర్‌లో అడ్వాన్స్ పొజిషన్ జారీ చేస్తూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు అందజేశారు.
భూమి బదలాయింపులో జాప్యం
ఎయిమ్స్ పేరున ప్రభుత్వ భూమి బదలాయింపులో జరుగుతున్న జాప్యంతో మినీ ఎయిమ్స్ (ఆర్‌హెచ్‌టీసీ) నిర్మాణానికి ఆటంకంగాా మారింది. ప్రభుత్వం కేటాయించిన 6 ఎకరాల భూమి మార్కెట్ విలువ ప్రకారం రూ. 80 లక్షలుగా ఉంది. కానీ మార్కెట్ విలువ రూ. 50 లక్షల లోపు ఉంటేనే భూ బదలాయింపు అంశం కలెక్టర్ పరిధిలో ఉంటుంది. దీంతో దీనికి సంబంధించిన ఫైల్ ముందుకు కదలడంలేదు. మూడేళ్లుగా కలెక్టరేట్‌లోనే మూలుగుతోంది. భూ బదలాయింపు పక్రియ తమ పరిధిలో లేదని సీసీఎల్‌ఏ పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి ఆమోదం పొందాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది.
పూర్తయితే..
ఆర్‌హెచ్‌టీసీ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది. 30 పడకలకు పైగా ఉండే ఆసుపత్రి, 25 మంది వైద్య విద్యార్థులకు టీచింగ్ అండ్ లెర్నింగ్ కోసం వసతి గృహాలు, మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లు కొలువుదీరే అవకాశం ఉంది. మినీ ఎయిమ్స్‌లో ఏమైనా క్రిటికల్ కేసులు ఉంటే అత్యవసర వైద్యం కోసం బీనగర్ ఎయిమ్స్‌కు అంబులెన్స్ ద్వారా తరలించే సదుపాయం అందుబాటులోకి రానున్నది.
ఆర్‌హెచ్‌టీసీ భవన నిర్మాణానికి 2022, 2023లో రూ.10కోట్ల చొప్పున రెండు పర్యాయాలు నిధులు మంజూరయ్యాయి. కానీ భూ బదలాయింపు ప్రక్రియ పూర్తికాక నిధులు వెనక్కి వెళ్లినట్లు తెలిసింది. మరో పర్యాయం నిధులు మంజూరై భూ బదలాయింపు జరగకపోతే మినీ ఎయిమ్స్ మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఫ బొమ్మలరామారంలో ఆర్‌హెచ్‌టీసీకి భూ బదలాయింపులో జాప్యం
ఫ భూమి మార్కెట్ విలువ రూ.80లక్షలు ఉండడంతో సీసీఎల్‌ఏ పరిధిలోకి అంశం
ఫ మూడేళ్లుగా కలెక్టరేట్‌లోనే మూలుగుతున్న ఫైల్
ఫ భవన నిర్మాణానికి ఇప్పటికే రెండు పర్యాయాలు వచ్చిన నిధులు వెనక్కి
మినీ ఎయిమ్స్‌కు మల్యాల గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఆరు ఎకరాలు ముందస్తు పొజిషన్ ఇచ్చాం. భూమి మార్కెట్ విలువ రూ.80లక్షలు ఉండడంతో భూ బదలాయింపు ప్రక్రియ సీసీఎల్‌ఏ పరిధిలోకి వస్తుంది.
– శ్రీనివాస్‌రావు తహసీల్దార్
మినీ ఎయిమ్స్‌పై నీలినీడలు


