అరగంటలో కుల ధ్రువీకరణ పత్రం
ఆలేరు: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు అరగంటలో ఆన్‌లైన్‌లో కులధ్రవీకరణ పత్రాన్ని జారీ చేయనున్నట్టు భువనగిరి ఆర్డీఓ, ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఆలేరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు 5ఏళ్ల క్రితం తీసుకున్న కుల ధ్రవీకరణ పత్రం సమర్పించినా సరిపోతుందన్నారు. కుల ధ్రవీకరణపత్రం లేని అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి కోసం నామినేషన్ల కౌంటర్ వద్ద డిప్యూటీ తహసీల్దార్‌ను నియమించామన్నారు. కుల ధ్రువీకరణ పత్రం లేని వారు నామినేషన్ల పత్రాలపై కౌంటర్ వద్దనే సదరు అధికారితో ధ్రువీకరణ చేసుకొని సమర్పించవచ్చని స్పష్టం చేశారు.అభ్యర్థితోపాటు అతన్ని ప్రతిపాదించే సహాయకులు కూడా ఇంటి పన్ను తదితర నో డ్యూ సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు. జనరల్ రిజర్వ్ వార్డుకు పోటీ చేసే వారు రూ. 2500, ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్‌వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 1250 నామినేషన్ రుసుం చెల్లించాలని చెప్పారు. అభ్యర్థికి ఏ వార్డులోనైనా ఓటు ఉండొచ్చని, ప్రతిపాదించే సహాయకుడి ఓటు అభ్యర్థి పోటీ చేసే వార్డులోనే ఉండాలన్నారు. కొత్త బ్యాంక్ ఖాతా తీయాలని, వీలుకాకపోతే పోస్టాఫీస్ ఖాతా నుంచి ఎన్నికల ఖర్చుల లావాదేవీలు చేయాలని అన్నారు. 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 8 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. అక్కడ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 3 వార్డులకు ఒక ఆర్వో చొప్పున 12 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు నలుగురు ఆర్వోలను ఏఆర్వోలను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, మేనేజర్ జగన్‌మోహన్, ఆర్వో దూడల వెంకటేష్‌లు ఉన్నారు.
ఫ నామినేషన్ల కౌంటర్ వద్ద డీటీ నియామకం
ఫ ప్రతిపాదికులూ నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించాల్సిందే
ఫ మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి


