ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
యాదగిరిగుట్ట: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు సూచించారు. బుధవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని నామినేషన్ కేంద్రాన్ని, హెల్ప్ డెస్క్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 35 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 25 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. నామినేషన్ వేసే సమయంలో నియమ నిబంధనలు చదువుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నామినేషన్ పత్రాలతో పాటు నామినేషన్లకు సంబంధించిన అన్ని పత్రాలను జతపరిచి సమర్పిస్తే స్క్రూట్నీ రోజు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్‌తో పాటు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తున్నారనే అంశాలను పరిశీలించారు. వారి వెంట ఆర్వోలు, స్థానిక మున్సిపల్ అధికారులున్నారు.
ధ్రువపత్రాలు పరిశీలించాలి
ఆలేరు: అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అన్ని ధ్రువపత్రాలు సరిగా ఉన్నాయో లేదో స్పష్టంగా పరిశీలించిన తర్వాతనే స్వీకరించాలని ఆర్‌ఓలకు కలెక్టర్ హనుంతరావు ఆదేశించారు. బుధవారం ఆయన ఆలేరు మున్సిపాలిటీలోని నామినేషన్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌లను పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థుల అర్హతలను పక్కా పరిశీలించాలని సూచించారు. ఏ వార్డుకు ఎంతమంది ఎన్ని నామినేషన్ల పత్రాలను తీసుకువెళ్లారనే వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు,మేనేజర్ జగన్‌మోహన్‌లు ఉన్నారు.


