టీఆర్పీతోనే అభివృద్ధి సాధ్యం
రామగిరి(నల్లగొండ): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టె జానయ్యయాదవ్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పడిన టీఆర్పీ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డులకు చెందిన యువకులు టీఆర్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజాగౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, ప్రధాన కార్యదర్శి నారాయణదాస్ కవిత, ఆత్మకూర్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, ఉమ్మడి నల్లగొండ సోషల్ మీడియా కన్వీనర్ సాయి, వినోద్, చారి, రఫీ, షఫీ పాల్గొన్నారు.
వరంగల్ హైవేపై మేడారం రద్దీ
భువనగిరిటౌన్ : హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే వారి వాహనాలతో బుధవారం బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. అంతేకాకుండా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున ఆశావహుల మద్దతుదారులు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. వీరికి తోడు వీఐపీల తాకిడి సైతం ఉందని టోల్‌ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. గురువారం, శుక్రవారం మేడారానికి తరలివెళ్లే వాహనాల రద్దీకి అనుగుణంగా ఆ మార్గంలో 8 టోల్‌బూత్‌లు ఓపెన్ చేయనున్నట్లు టోల్ నిర్వాహకులు తెలిపారు.
టీఆర్పీతోనే అభివృద్ధి సాధ్యం


