చికిత్స పొందుతూ మహిళ మృతి
నల్లగొండ టౌన్: నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్ము మండలానికి చెందిన పులికంటి రమణ(40) అనే మహిళ కడుపునొప్పితో వారం క్రితం తులసి ఆస్పత్రిలో చేరగా వైద్యులు పరీక్ష చేసి శస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. ఆపరేషన్ సమయంలో గర్భసంచి తొలగించే బదులు ఆమె మూత్రనాళం తొలగించారని, తిరిగి రెండోసారి ఆపరేషన్ చేసినా ఫలితం లేక రమణ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు.
కూలీల ఆటోను ఢీకొన్న కారు
ఫ నలుగురికి తీవ్రగాయాలు
నిడమనూరు: కూలీల ఆటోను కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం నుంచి సోమోరిగూడేనికి 14 మంది కూలీలు మంగళవారం వరి నాటు కోసం వచ్చారు. సాయంత్రం తిరుగుప్రయాణంలో జంగాలవారిగూడెం దాటగానే ఎదురుగా వచ్చిన కారు, కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తాపడి కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కూలీలు గడగోజు పద్మ, నర్సింగ్ లక్ష్మమ్మ, దాసరి సరిత, మేకపోతుల కళమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 108కు సమాచారం అందించడంతో, సిబ్బంది క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఫుడ్‌సేఫ్టీ అధికారుల
విధులకు ఆటంకం
ఫ కిరాణా షాపు నిర్వాహకులపై
కేసు నమోదు
వలిగొండ : వలిగొండలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కిరాణా షాపు నిర్వాహకులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వలిగొండ మెయిన్ రోడ్డుపై గల మణికంఠ ట్రేడర్స్ కిరాణా షాపులో కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్‌రెడ్డి తన కార్యాలయ అటెండర్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లేబుల్స్ లేని ఆహార పదార్థాలు, తప్పుడు లేబుల్స్ ఉన్న ఆహార పదార్థాలతోపాటు, కల్తీ పదార్థాలను గుర్తించారు. ఈక్రమంలో వారిపై కిరాణా షాపు యజమానులు నాగభూషణం, ఆయన కుమారుడు మణికంఠ, భార్య లలిత అక్కడకు వచ్చి అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. అసభ్య పదజాలంతో వారిని దూషించారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
గట్టుప్పల్ : మండల కేంద్రానికి చెందిన ఖమ్మం శ్రీనివాస్ కుమారుడు ఖమ్మం చరణ్ అండర్–17 జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. పోటీలు ఈ నెల 29న జార్ఘండ్ రాష్టం రాంచీలో జరుగనున్నాయి. చరణ్ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సోషల్ వెల్ఫేర్ సైనిక్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.


