భక్తులు పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలి
రాజాపేట : పులి సంచారంపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి డీఎస్పీ శ్రీనివాసనాయుడు అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలోని చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య, పోలీస్ బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, పోలీస్ సిబ్బంది వంటి అంశాలను పరిశీలించారు. బందోబస్తుపై పలు సూచనలు చేశారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. తుర్కపల్లి మండలంలో పులి సంచారంపై జాగ్రత్తగా ఉండాలని, తుర్కపల్లి మండలం రాజాపేట మండలానికి ఆనుకుని ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భదత్ర ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు 150 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ మాదాసు శంకర్ గౌడ్, ఎస్‌ఐలు తకియోద్దీన్, అశోక్, ఏఎస్‌ఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


