మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం
భువనగిరిటౌన్ : మహిళా ఉద్యోగులు, సందర్శకుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని కలెక్టర్ హనుమంతరావు.. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా ఉద్యోగులు, సందర్శకులు అనారోగ్యానికి గురైనప్పుడు విశ్రాంతి తీసుకునే వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
పథకాల పేరు కాదు..
ప్రజల జీవితాలను మార్చాలి
ఆలేరు: ‘ఉపాధి హామీ పేరు మార్చి మోదీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాసే కుట్రలు చేస్తోంది.. పథకాల పేరు మార్చడం కాదు.. ప్రజల జీవితాలను మార్చే ఆలోచన చేయాలి’ అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేంద్రానికి హితవు పలికారు. సోమవారం ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ భవన్ వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఈనెల 30న ఆలేరు మండలం మందనపల్లిలో కార్మికులతో నిర్వహించనున్న సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పాల్గొననున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చకుండా యథావిధిగా కొనసాగించాలన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎస్ విజయ్‌కుమార్, నీలం వెంకటస్వామి, రాజశేఖరగౌడ్ పాల్గొన్నారు.
దంత వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రమేష్‌రెడ్డి
నల్లగొండ టౌన్ : భారత దంత వైద్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన డాక్టర్ జూలకంటి రమేష్‌రెడ్డి ఎన్నికయ్యా రు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర దంత వైద్య సదస్సులో రమేష్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దంత వైద్య సంఘం ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాలు, పాఠశాలల్లో ఉచితంగా ప్రత్యేక దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.
మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం


