పాఠశాలల నిర్వహణకు నిధులొచ్చాయ్..
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు రెండో విడత నిధులు వచ్చాయి. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా నాలుగు నెలల కిందట 50 శాతం నిధులు రాగా తాజాగా మిగిలిన నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 599 పాఠశాలలకు 71,05,500 రూపాయలు వచ్చాయి. వీటిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇక 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలకు నిరాశే ఎదురైంది.
47 పాఠశాలలకు రాని నిధులు:
జిల్లా వ్యాప్తంగా 646 పాఠశాలలకు గాను 599 స్కూళ్లకు నిర్వహణ నిధులు మంజూరు అయ్యాయి. మిగిలిన 47 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులున్నారు. ఆయా పాఠశాలలకు మొదటి విడతతోపాటు రెండో విడతలోనూ నిధులు రాలేదు. ఈపాఠశాలల్లో నిర్వహణ ఖర్చులు ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు మాత్రమే భరిస్తూ వస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో 1–30 వరకు విద్యార్థులున్న పాఠశాలలకు రూ. 10వేలు, 31 నుంచి 100 మంది ఉన్న పాఠశాలలకు రూ. 25వేలు, 101 నుంచి 250 మంది ఉన్న పాఠశాలలకు రూ. 50వేలు, 250నుంచి 1000 మంది ఉన్న పాఠశాలలకు రూ. 75వేల చొప్పున , 1000 మందికి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు రూ. లక్ష చొప్పున మంజూరు అయ్యాయి. ఎస్సీ కాంపోనెంట్ కింద 24 శాతం, ఎస్టీ కింద 14 శాతం, జనరల్ కాంపోనెంట్ కింద 62 శాతం మంజూరైనట్లు అధికారులు వివరించారు.
ఖర్చు చేయాల్సింది ఇలా..
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల సంయుక్త ఖాతాలో నిధులు జమ చేస్తున్నారు. కమిటీ తీర్మానం మేరకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. గదులకు అవసరమైన మరమ్మతులు చేయించడం, శుభ్రత, ప్రయోగశాలకు పరికరాలు, స్టేషనరీ, పత్రికలు, పాఠశాలల సమవేశాల నిర్వహణ, జాతీయ పండుగలు, కంప్యూటర్లు, ప్రాజెక్టు నిర్వహణ, డిజిటల్ తరగతుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులు రావడంతో పాఠశాలల్లో సమస్యలు తీరనున్నాయి.
ఫ రూ.71.05లక్షలు మంజూరు
ఫ 599 బడుల్లో పరిష్కారం కానున్న సమస్యలు
ఫ 10 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు నిరాశే


