మోసాలపై అప్రమత్తగా ఉండాలి
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు వ్యక్తులు తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులమని చెప్పుకుంటూ ఆహార వ్యాపారులను బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. శ్రీకాంత్‌రెడ్డి, విక్రమ్‌నాయుడు, శ్రీనివాస్‌నాయక్ అనే పేర్లతో కొందరు నకిలీ వ్యక్తులు ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పుకుంటున్నారని, వారు 80747 35461, 73861 60150, 88863 97761 ఫోన్ నంబర్లు ఉపయోగిస్తున్నారని వీరి విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ వ్యాపారుల సమాచారం తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు.
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయంగా చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకోగా, పూజారులు శ్రీస్వామివారి ఆశీస్సులను భక్తులకు అందజేశారు. ఇక ప్రధానాలయ గర్భాలయంలో సుప్రభాతం, అభిషేకం, సహస్ర నామార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు.


