యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్యారాధనల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. గురువారం ఉదయం ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు.. ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి కల్యాణ మండపంలోకి వేంచేపు చేసి కల్యాణతంతు జరిపారు. అంతకుముందు వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.


