యాదగిరీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ కార్తీక మాసంలో గతేడాది కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఆలయ ఈవో వెంకట్రావ్ కార్తీక మాసం చివరి రోజైన గురువారం వివరాలు వెల్లడించారు. ఈ కార్తీక మాసంలో రూ.17,62,33,331 ఆదాయం రాగా.. గతేడాది కార్తీక మాసంలో రూ.14,30,69,481 వచ్చింది. గతేడాదితో పోల్చుకుంటే ఆదాయం రూ.3,31,63,850 అధికంగా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 22న తేదీన కార్తీక మాసం ప్రారంభమై గురువారం (ఈ నెల 20వ తేదీ) ముగిసింది. కార్తీక మాసం ప్రారంభమే శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రంతో మొదలైంది. దీంతో మొదటి రోజే భక్తులు అధిక సంఖ్యలో శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్తీక మాసంలో శ్రీస్వామి వారిని 20,52,054 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా ఈ ఏడాది కార్తీక మాసంలో 24,447 జంటలు వ్రత పూజల్లో పాల్గొనగా.. గతేడాది 23,263 జంటలు పాల్గొన్నాయి.
ప్రత్యేక గ్రీవెన్స్‌లో 47 అర్జీలు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం, గురువారం నిర్వహించే ప్రజావాణి, ప్రత్యేక గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలను జాప్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 47 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
క్రీడల్లోనూ రాణించాలి
భువనగిరి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా యువజన సర్వీసుల, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు అన్నారు. గురువారం భువనగిరిలోని ఇండియా మిషన్ హైస్కూల్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఖోఖో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 28,29,30 తేదీల్లో సంగారెడ్డిలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఎంపిక పోటీల్లో 200 మంది పాల్గొన్న 20 మంది బాలురు, 20 మంది బాలికలను రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్సాండెంట్ జూడో, పీఈటీలు పల్లె రమేష్‌రెడ్డి, పిట్టల అంజనేయులు, శ్రీను, విజయ్, పవన్, దత్తు, సాయి తదితరుల పాల్గొన్నారు.
వరి వంగడాల పరిశీలన
మోత్కూరు: మోత్కూరు పట్టణానికి చెందిన రైతు బిళ్లపాటి గోవర్ధన్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ విధానంలో సాగు చేసిన దేశీయ వరి వంగడాల క్షేత్రాన్ని గురువారం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీలత సందర్శించారు. పంటల సాగులో యాజమాన్యం, సేంద్రియ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పొడిచేడులో క్రాప్ బుకింగ్ ఎన్‌హాన్స్‌మెంట్ కార్యక్రమం కింద సాగు చేసిన పంటలను పరిశీలించారు. అదే విధంగా పాలడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఏఓ కీర్తి, ఏఈఓలు గోపినాథ్, అశోక్, సింహప్రసాద్ పాల్గొన్నారు.
యాదగిరీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం


