వారసత్వ వారోత్సవాలు లేనట్టేనా?
పిల్లలమర్రిలో నిర్వహిస్తున్నాం
భువనగిరి: చారిత్రక కట్టడాలు, ప్రదేశాల ప్రాముఖ్యతను వివరించేందుకు ఏటా నవంబర్‌లో నిర్వహించే వారసత్వ వారోత్సవాలు ఈసారి లేనట్టే కనిపిస్తోంది. 19 నుంచి 25వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. చారిత్రక నేపథ్యం కలిగిన భువనగిరి ఖిలా వద్ద పురావస్తు శాఖ ఆధ్వర్యంలో వారసత్వ వారోత్సవాలు నిర్వహించేవారు.
గతంలో నిర్వహించిన కార్యక్రమాలు
వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి చారిత్రక కట్టడాలపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. పర్యాటకులు, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించి కట్టడాల ప్రాముఖ్యతను వివరించేవారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అటువంటి ఖిలా నేడు ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోవడం లేదు.
కోటపై నిర్లక్ష్యం
భువనగిరి ఖిలా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన త్రిభువన మల్ల ఆవర విక్రమాదిత్య ఏకశిలపై కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. కుతుబ్ షాహీలు, మెఘలు చక్రవర్తులు, కాకతీయులు, సర్దార్ సర్వాయి పాపన్న ఏలుబడిలో కోట ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన భువనగిరి ఖిలా గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏటా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి ఖిలా, పానగల్‌లో వారసత్వ వారోత్సవాలు నిర్వహించేది. ఈసారి ఉమ్మడి నల్లగొండలో ఎక్కడా వారోత్సవాలు నిర్వహించడం లేదు.
ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ మేరకు ఈసారి మహబూబర్‌నగర్ జిల్లా పిల్లలమర్రిలో వారసత్వ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా నిర్వహించడం లేదు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవు.
–నాగలక్ష్మి, పురావస్తు శాఖ ఏడీ
ఫ ఏటా నవంబర్ 19 నుంచి
25వ తేదీ వరకు ఉత్సవాల నిర్వహణ
ఫ ఈసారి ఇప్పటి వరకు ఏర్పాట్లు చేయని అధికారులు


