
భార్యను హత్య చేసిన భర్త
రాజాపేట: కుటుంబ కలహాలతో భార్య గొంతు నులిమి భర్త హత్య చేశాడు. ఈ ఘటన రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామంలో జరిగింది. సోమవారం ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపన వివరాల ప్రకారం.. పుట్టగూడెం గ్రామానికి చెందిన ముడావత్ అమృకు అదే గ్రామానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. వీరు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు గ్రామస్తుల మధ్య పంచాయితీ పెట్టి మాట్లాడుకున్నారు. కాగా ఆదివారం రాత్రి సుజాత(35) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామస్తులు గమనించి సుజాత తల్లి పింప్లికి సమాచారం ఇచ్చారు. సుజాత తల్లి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకర్‌గౌడ్ క్లూస్‌టీంను పిలిపించి వివరాలు సేకరించారు. భర్త అమృనే సుజాత గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపినట్లు గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.