
నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలకు..
భూదాన్‌పోచంపల్లి: నిరంతర సాధనతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని చెప్పారు. 75శాతం మంది విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ వందశాతం ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని అన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో సామాజిక దృక్పథం, మనో వికాసం, సేవా కార్యక్రమాలు, టీమ్ స్పిరిట్ పెంచడానికి తరచూ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారిణి, యూనివర్సిటీ అడ్వైజర్ డాక్టర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టనష్టాలు, ఒడిదొడుకులు అన్నింటిని ఎదుర్కొన్నప్పుడే వారు మానసిక పరిపూర్ణత సాధిస్తారని అన్నారు. అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వీఎంవీ రావు మాట్లాడుతూ.. పట్టుదలను పెట్టుబడిగా పెడితే లక్ష్యసాధన సులభతరం అవుతుందని అన్నారు. మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉపాధి రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్‌లు, డైరెక్టర్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్
లావు రత్తయ్య

నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలకు..