
గాజాపై దాడులు విరమించుకోవాలి
రామగిరి(నల్లగొండ): పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను విరమించుకోవాలని ముస్లిం సంఘాల నేతలు కోరారు. గాజాపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ ముస్లిం మతపెద్దలు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్, మౌలానా యాసర్ హుస్సేన్, మౌలానా ముఫ్తీ సిద్దీఖ్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి క్లాక్‌టవర్ సెంటర్ వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. సేవ్ గాజా అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా క్లాక్‌టవర్ సెంటర్‌లో పలువురు మాట్లాడుతూ.. గాజా ప్రజలపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. యుద్ధం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నల్లగొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హఫీజ్‌ఖాన్, అహ్మద్ కలీం, సామాజిక కార్యకర్త పి. దేవి, నాగార్జున, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన ముస్లింలు