
సైన్స్ కాంగ్రెస్‌కు ఎంజీయూ విద్యార్థుల ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనిర్సిటీలో పీజీ(బోటనీ) చదువుతున్న విద్యార్థులు వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్–2025లో ‘ఎవల్యూషన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ పొటెన్షియల్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్ రైసోమ్ ఎక్స్‌ట్రాక్ట్’ అనే అంశంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నట్లు అధ్యాపకురాలు శ్రావ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టు లో భాగంగా ఎన్నుకున్న పరిశోధన పత్రాన్ని సైన్స్ కాంగ్రెస్‌లో సమర్పణకు ఎంపిక కావడం గర్వకారణమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పరిశోధనలో భాగస్వాములైన విద్యార్థులు సాంబశివరావు, మౌనిక, గీత, నవనీత, త్రివేణి, స్వప్న, రవళికను అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాల్ కె. ప్రేమ్‌సాగర్ అభినందించారు.
గ్రానైట్ తరలిస్తున్న
లారీల పట్టివేత
నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్న 18 లారీలను నాగార్జునసాగర్‌లో సోమవారం తెల్లవారుజామున స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన లారీల్లో కొన్నింటిని హిల్‌కాలనీలోని బుద్ధవనం ముందు గల సిద్దార్ధ హోటల్ వద్ద, మరికొన్నింటిని మరో చోట ఉంచారు. నల్లగొండ జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు పోలీసులు సమాచారమివ్వడంతో వారు సాయంత్రానికి సాగర్ చేరుకుని, లారీల డ్రైవర్ల వద్ద గల అనుమతి పత్రాలను చూసి విచారణ చేపట్టారు. ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారి జాకోబ్‌ను వివరణ కోరగా.. తమ కార్యాలయ సిబ్బందిని నాగార్జునసాగర్‌కు పంపించామని, వారు విచారణ చేస్తున్నారని తెలిపారు. మంగళవారం ఉదయానికి వాటి లెక్కలు తేలుతాయని వివరించారు.
వ్యక్తి అదృశ్యం
నేరేడుచర్ల: నేరేడుచర్ల పట్టణానికి చెందిన సట్టు శ్రీను ఈ నెల 11న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు సోమవారం నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపారు. శ్రీనుకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు శ్రీను తెల్ల రంగా చొక్కా, నీలి రంగు లుంగి ధరించాడని, ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీను ఆచూకీ తెలిసినవారు 87126 86054, 87126 86012 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
యాదగిరిగుట్ట రూరల్: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకందుకూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు నల్లమాస శంకరయ్య(58) రోజుమాదిరిగానే సోమవారం ఉదయం కల్లు గీసేందుకు గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు జారడంతో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోరారు.