సూర్యాపేటటౌన్: బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ల వద్ద ఫ్రీక్వెన్సీ కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు. జూన్‌లో నడిగూడెం, మునగాల పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్లకు సంబంధించి ఫ్రీక్వెన్సీ కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం మునగాల పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఆకుపాముల గ్రామం వెళ్లగా.. అక్కడ బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కారులో ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం రాజాపూరం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనాథ్, బుడుపుల వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన ఇద్దరు నిందితులతో పాటు కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన చలిగంటి శ్రావణ్‌కుమార్ కలిసి సుమారు నాలుగు నెలల కాలంలో తొమ్మిది బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్లలో కట్టర్, హ్యాక్‌సా బ్లేడ్ ఉపయోగించి కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. దొంగతనం చేసిన కేబుల్ వైర్లను కాల్చి దాని నుంచి కాపర్ వైరును తీసి బస్తాల్లో వేసుకుని హైదరాబాద్‌కు తీసుకెళ్లి జీడిమెట్ల, పటాన్‌చెరు ఏరియాల్లో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బులు పంచుకుని జల్సాలు చేసేవారని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.2.75లక్షల నగదు, 270 మీటర్ల కేబుల్ వైరు, కారు, కట్టర్, హ్యాక్‌సా బ్లేడ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రావణ్‌కుమార్‌కు గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్లలో పనిచేసిన అనుభవం ఉందని, అతడిపై 4 దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. శ్రీనాథ్, వంశీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. శ్రావణ్‌కుమార్ పరా రీలో ఉన్నాడు. ఈ విలేకరుల సమావేశంలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.2.75 లక్షల నగదు,
కారు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సూర్యాపేట
ఎస్పీ నరసింహ