
పాల వెల్లువే..!
ముఖ్యమంత్రిని కలుస్తాం
ఒప్పందం
కుదిరితే
సాక్షి, యాదాద్రి: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన మదర్ డెయిరీని గట్టెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. సంస్థ పాలకవర్గం ఈనెల 12న గుజరాత్‌కు వెళ్లి ఎన్‌డీడీబీని (జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ)ను ఆశ్రయించింది. ఎన్‌డీడీబీ చైర్మన్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. సంస్థను తీసుకుని లాభాల పట్టించాలని కోరగా అందుకు సానుకూల స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎన్‌డీడీబీ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఆర్థిక సంక్షోభంలో సంస్థ
ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న మదర్ డెయిరీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రకరకాల కారణాలతో డెయిరీ అప్పులు పెరిగిపోయాయి. సంస్థను గట్టెక్కించేందుకు పాలకవర్గం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, పాఠశాలలు, హాస్టళ్లకు మదర్ డెయిరీ నుంచి నెయ్యి, పాలు సరఫరా చేసేవారు. దీని ద్వారా మదర్ డెయిరీకి భారీ ఆదాయం సమకూరేది. కానీ, ఆ బాధ్యతలను ప్రభుత్వం విజయ డెయిరీకి అప్పగించింది. దీనికి తోడు మార్కెటింగ్ లోపాల వల్ల ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు బ్యాంకుల నుంచి రూ.35 కోట్ల రుణాలు తీసుకోగా, తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా 50 వేల మంది పాడి రైతులకు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. నెలకు రూ.1.20 కోట్ల భారం పడుతుండటంతో వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో మదర్ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థిరాస్తులు అమ్మితే కానీ బయటపడే పరిస్థితి లేదు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యా వద్ద సంస్థకు చెందిన సుమారు 30 ఎకరాల భూమి విక్రయించాలని నిర్ణయించగా.. వాటిపై కోర్టు స్టే విధించింది.
చివరి ప్రయత్నంగా..
చివరి ప్రయత్నంగా మదర్ డెయిరీ పాలకవర్గం ఈనెల 12వ తేదీన గుజరాత్‌లోని ఆనందనగర్‌లో గల ఎన్‌డీడీబీని ఆశ్రయించింది. నాలుగు రోజుల పాటు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. 14న సంస్థ చైర్మన్‌తో ప్రత్యేకంగా సమావేశమై సంస్థను తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. డెయిరీ ఆస్తులు, అప్పులు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ప్రస్తుతం వస్తున్న పాలు, విక్రయిస్తున్న ఉత్పత్తులు, రవాణా చార్జీలు తదితర అంశాలపై ఆయనతో చర్చించారు.మదర్ డెయిరీతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎన్‌డీడీబీ అంగీకారం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసీ ఇస్తేనే ఒప్పందం కుదురుతుంది. త్వరలోనే పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించనుంది. అంతా సవ్యంగా సాగితే మదర్ డెయిరీ లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మదర్ డెయిరీని నష్టాల
నుంచి గట్టెక్కించే యత్నం
ఎన్‌డీడీబీకి ఆశ్రయించిన పాలకవర్గం
డెయిరీ ఆస్తులు, అప్పులు,
ఇతర అంశాలపై చర్చలు
సంస్థను అభివృద్ధి చేయడానికి
ఎన్‌డీడీబీ సానుకూలం
ప్రభుత్వం అంగీకరిస్తే కొలిక్కి
వచ్చే అవకాశం
త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని
కలవనున్న నార్ముల్ డైరెక్టర్లు
మదర్ డెయిరీ అభివృద్ధికి ఎన్‌డీడీబీ సహకారం తీసుకోవాలని నిర్ణయించాం. నాతో పాటు 14మంది మదర్ డైయిరీ డైరక్టర్ల తీర్మానం మేరకు అందరం కలిసి గజరాత్ వెళ్లాం.ఎన్‌డీడీబీ చైర్మన్‌ను కలిసి చర్చించగా మదర్ డైయిరీని అభివృద్ధి చేయడానికి ఆయన అంగీకరించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలసి త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ ఇప్పించాలని కోరుతాం. ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్‌డీడీబీతో ఎంఓయూ కుదుర్చుకుని డెయిరీని కాపాడుకుంటాం.
– గుడిపాటి మధుసూదన్‌రెడ్డి,
మదర్ డెయిరీ చైర్మన్

పాల వెల్లువే..!