
రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి
చివ్వెంల : బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన నత్త భానుప్రకాశ్ (22), అతని స్నేహితులు మణిదీప్, పవన్ ముగ్గురు బైక్‌పై విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. గుంజలూరు స్టేజీ వద్దకు రాగానే వారి బైక్ అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న భానుప్రకాశ్ తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కూడా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ట్రాక్టర్ ఢీకొనడంతో మరొకరు..
గుండాల : మద్యం మత్తులో అతివేగంతో ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలో బోనాల పండుగను పురస్కరించుకొని గ్రామానికి చెందిన సంగు శ్రీను ట్రాక్టర్‌ను గ్రామ దేవతల చుట్టూ అతివేగంతో తిప్పుతుండడంతో అదుపు తప్పి గ్రామానికి చెందిన రామగిరి శ్రీరాములు (55) ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. పోతుగంటి లింగన్న, బుర్ర శేఖర్‌కు గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయాల పాలైన వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో లింగన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇంకొకరు..
డిండి: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం డిండి మండలం పెద్దతండా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ముడి రాములు(58), ముడి శ్రీను తమ అవసరాల నిమిత్తం మండలంలోని బొల్లనపల్లి గ్రామానికి వెళ్లి బైక్‌పై స్వగ్రామానికి తిరుగి వస్తున్నారు. ఈ క్రమంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డిండి నుంచి చెర్కుపల్లి స్టేజీ మీదుగా దేవరకొండకు వెళ్తోంది. ఈ సమయంలో పెద్దతండా సమీపంలోకి రాగానే ముడి శ్రీను నడుపుతున్న బైక్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైక్ వెనుక కూర్చున్న ముడి రాములు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన శ్రీనును దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాములు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.
లారీని ఢీకొన్న కోళ్ల వ్యాన్
ఒకరి మృత్యువాత
చందంపేట: ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాను వెనుకనుంచి ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వేకువజామున చందంపేట మండలంపోలేపల్లి గేటు సమీ పంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండి నుంచి వడ్ల లోడ్‌తో దేవరకొండకు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. కోళ్ల వ్యానులో ఉన్న గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన భూతం లింగయ్య(45)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాను డ్రైవర్ కుంటిగొర్ల సైదులు, మరో వ్యక్తి వడ్లమల్ల రాఘవేందర్‌కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూతం లింగయ్య మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు భార్య ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
ఏడుగురు వ్యక్తులకు గాయాలు
చివ్వెంల, గుండాల, చందంపేట,
డిండి మండలాల పరిధిలో ఘటనలు
ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీ వద్ద ఒకరు, గుండాల మండలం బండ కొత్తపల్లి వద్ద, డిండి మండలం పెద్దతండాలో, చందంపేట మండలం పోలేపల్లి గేటు సమీపంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగు వ్యక్తులు మృత్యు వాతపడ్డారు.

రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం